కెరమెరి: అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే భావుబీజ్ ఉత్సవాలు ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్ జిల్లాలోని అనేక మండలాల్లో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రకు ఆసుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా ఈ పండుగ జరుపుకుంటారు. దీపావళి పర్వదినం అనంతరం ఈ పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవం కార్తిక పౌర్ణమి వరకు కొనసాగుతుంది. ఈ రోజు అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములు ఇళ్లకు చేరుకొని వారికి హారతులిస్తారు. వారి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే రోజును ఉత్సవంగా భావిస్తారు. అన్నదమ్ములు సుఖంగా ఉండాలని, చిరకాలంగా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సోదరీమణులు కోరుకుంటారు. భావుబీజ్ రోజు అక్కాచెల్ల్లెళ్లు వారి సోదరులకు టెంకాయ, మొలదారం, తమలపాకులు, పోకలను సమర్పిస్తారు. తలకు రుమాలు పెడతారు. మిఠాయిలు తినిపిస్తారు. మంగళహారతులు ఇస్తారు. కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు.
ప్రేమకు గుర్తుగా..
అన్నదమ్ముల ప్రేమకు గుర్తుగా ప్రతీ సంవత్సరం దీపావళి తర్వాత భావుబీజ్ పండుగ జరుపుకుంటాం. అన్నదమ్ములు, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తాం. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకుంటాం.
– చోళే మీరా, గృహిణి, కెరమెరి


