● మరొకరికి గాయాలు ● హైదరాబాద్ సమీపంలో ఘటన
జన్నారం/శామీర్‌పేట్: తండ్రిని బస్సు ఎక్కించి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరిన కొడుకు విగతజీవిగా మారడం కుటుంబంలో విషాదం నింపింది. మృతుడి కుటుంబ సభ్యులు, సీఐ గురువయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కుడిది రమేష్, విజయ దంపతుల కుమారుడు నవీన్(20) హైదరాబాదులోని సిటీ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు రోజుల క్రితం స్వగ్రామం రాంపూర్‌కు వచ్చాడు. గురువారం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరాడు. తన తండ్రి రమేష్ కూడా హైదరాబాద్‌కు పనిమీద వస్తానని తెలిపాడు. తండ్రిని గురువారం రాత్రి 10గంటలకు తాళ్లపేటలో హైదరాబాద్ బస్సు ఎక్కించిన నవీన్ తన స్నేహితుడు మహ్మదాబాద్ గ్రామానికి చెందిన దుర్గం సిద్ధుతో కలిసి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయల్దేరాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జీనోమ్‌వ్యాలీ పోలీసుస్టేషన్ పరిధిలోని మజీద్‌పూర్ మారుతి షోరూం వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని ట్రక్కు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. దీంతో నవీన్ ద్విచక్ర వాహనం వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో నవీన్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుకాల కూర్చున్న సిద్ధు కాలు విరిగింది. నవీన్ మృతితో రాంపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. జీనోమ్ వ్యాలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ పెట్రోల్ బంక్ ఎదుట శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐ నీలం రవి తెలిపిన వివరాల ప్రకారం వాంకిడి మండలం కిరిడి గ్రామానికి చెందిన డీఎంఎల్టీ చేస్తున్న ఆకాష్ అనే యువకుడు తన పల్సర్ బైక్‌పై వెళ్తూ మోతుగూడ గ్రామానికి చెందిన గురువయ్య కుమారుడు ప్రశాంత్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


