రాజకీయ జోక్యంతోనే సమస్యలు పెండింగ్‌ | - | Sakshi
Sakshi News home page

రాజకీయ జోక్యంతోనే సమస్యలు పెండింగ్‌

Nov 14 2026 12:23 AM | Updated on Nov 14 2026 12:23 AM

భూపాలపల్లి అర్బన్‌: రాజకీయ జోక్యంతోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) కేంద్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్‌ ఆరోపించారు. సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం భూపాలపల్లిలోని ఇల్లందు క్లబ్‌లో నిర్వహించిన యూనియన్‌ కేంద్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. మందమర్రి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ టెండర్లలో సింగరేణికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ నెల 17న టెండర్లు ఖరారు కానున్న నేపథ్యంలో సంస్థ స్వయంగా పాల్గొని బ్లాక్‌ను దక్కించుకోవాలని అన్నారు. పీవీ ఓపెన్‌కాస్ట్‌ కోసం పోరాటం భూపాలపల్లి ప్రాంతానికి కీలకమైన పీవీ నరసింహారావు ఓపెన్‌కాస్ట్‌ గని ఏర్పాటులో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. రామప్ప సరస్సుకు ముప్పు ఉందనే అభ్యంతరాలు, రాజకీయ, న్యాయపరమైన వివాదాలతో ప్రాజెక్టు నిలిచిపోయిందని ఆరోపించారు. గని సాధన కోసం ములుగు కలెక్టర్‌ను కలిసి నిరభ్యంతర పత్రం కోరినట్లు తెలిపారు. త్వరలో మంత్రి సీతక్కను కలిసి ప్రభుత్వ సహకారం కోరుతామని, అవసరమైతే నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించారు. మెడికల్‌ బోర్డు, వారసత్వ ఉద్యోగాలు, కొత్త గనుల ఏర్పాటు, కార్మికులపై రాజకీయ జోక్యం తదితర సమస్యల పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిల సాధన కోసం ఈ నెల 17, 18, 19 తేదీల్లో అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కేంద్ర కమిటీ నాయకులు కె.సారయ్య, కె.వీరభద్రయ్య, వైవీ రావు, ఎం సమ్మయ్య, ఎం ఎల్లయ్యతో పాటు వివిధ బ్రాంచ్‌ల కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement