● అద్దె భవనాలకు ఇక చెల్లు ● పక్కా భవనాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ● జిల్లాలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు నాలుగు ఉన్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లిలో ఒక్కొక్కటి, చెన్నూర్‌లో రెండు ఉండగా.. అన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
● తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు పది ఉన్నాయి. మంచిర్యాల, లక్షెట్టిపేట, బెల్లంపల్లి(గర్‌ల్స్), బెల్లంపల్లి(సీవోఈ), చెన్నూర్, కోటపల్లి, మందమర్రి, కాసిపేట, జైపూర్‌తోపాటు సోషల్ వెల్ఫేర్ పరిధిలోని డిగ్రీ కాలేజీలు కొనసాగుతున్నాయి. కాసిపేట మండలానికి మంజూరైన గురుకులం బెల్లంపల్లిలో, కోటపల్లి గురుకులం జైపూర్, మంచిర్యాల గురుకులం ముల్కల్లలో, మందమర్రి గురుకుల విద్యాలయం రామక్రిష్ణాపూర్ సింగరేణి భవనంలో ఉన్నాయి. మంచిర్యాల సోషల్ వెల్ఫేర్ పరిధిలోని డిగ్రీ కళాశాల అద్దె భవనంలో విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తోంది.
● జిల్లాలో మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాల(ఎంజేపీటీబీసీ)లు ఎనిమిది ఉండగా.. ఆరు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మంచిర్యాల బాయ్స్(గుడిపేటలో) ప్రభుత్వ పాఠశాల భవనంలో నడుస్తోంది. ఈ లెక్కన లక్సెట్టిపేట బాయ్స్ మాత్రమే పక్కా భవనం కలిగి ఉంది. మిగతా తాండూర్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల(గర్‌ల్స్) లక్సెట్టిపేట, చెన్నూర్‌లో పక్కా భవనం లేకుండా పోయింది. మంచిర్యాల ఎంజేపీ బీసీ డిగ్రీ కళాశాల కూడా ప్రైవేటు భవనంలోనే నిర్వహిస్తున్నారు.
● జిల్లాలో ఎస్టీ మినహాయిస్తే ఎస్సీ, బీసీ వసతిగృహాలన్నీ సగం అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఎనిమిది ప్రీ మెట్రిక్, ఎనిమిది పోస్టు మెట్రిక్ వసతిగృహాలు ఉన్నాయి. ప్రీ మెట్రిక్‌లో మూడు బాలికలు, ఐదు బాలురు, పోస్టు మెట్రిక్‌లో నాలుగు చొప్పున బాలబాలికల వసతిగృహాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఆరు చోట్ల ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి. చెన్నూర్ బాయ్స్ కాలేజీ హాస్టల్, మంచిర్యాల బాయ్స్ కళాశాల, గర్‌ల్స్ హాస్టల్ కళాశాల, బెల్లంపల్లి గర్‌ల్స్ కళాశాల హాస్టల్, దండేపల్లి బాయ్స్, చెన్నూర్ బాయ్స్, మందమర్రి గర్‌ల్స్ హాస్టల్ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు.
● జిల్లాలో 24ఎస్సీ వసతిగృహాల్లో 12వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కోటపల్లి, చె న్నూర్ బాయ్స్, జైపూర్, మందమర్రిలో కళాశా ల వసతిగృహం(బాయ్స్, గర్‌ల్స్), ప్రీమెట్రిక్, బెల్లంపల్లి ప్రీ మెట్రిక్, తాండూర్, దండేపల్లి, చింతగూడ, లక్సెట్టిపేట బాయ్స్, గర్‌ల్స్ వసతిగృహాలకు పక్కా భవనాలు లేకుండా పోయా యి. బెల్లంపల్లిలో బాయ్స్ భవనం కూలిపోయే దశలో ఉండగా కళాశాల వసతిగృహం ఇంటిగ్రేటెడ్ వసతిగృహంలో నిర్వహిస్తున్నారు.
మంచిర్యాలఅర్బన్: సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలకు మహర్దశ రానుంది. ఇకపై హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని, పక్కా భవనాల నిర్మాణానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో పలు ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ వసతిగృహాలతోపాటు జ్యోతిబా పూలే, సాంఘిక సంక్షేమ, మైనార్టీ గురుకులాల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో మెజార్టీ వసతిగృహాలు, గురుకులాలు ఏళ్ల తరబడిగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సరిపడా గదులు, వసతులు లేక ఇరుకు గదుల్లోనే విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో అద్దె చెల్లింపుల జాప్యంపై భవన యజమానులు పాఠశాలలకు తాళం వేయడం తెలిసిందే. మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్‌లో పాఠశాల గేట్లు, భవనాలకు తాళం వేయగా యజమానులపై పోలీసు కేసులు నమోదు కావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక అద్దె భవనాల్లో అవస్థల మధ్య కొనసాగుతున్న వాటికి సొంత భవనాల భాగ్యం కలుగనుంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
అద్దె భవనాలపై ఆరా..
తాజాగా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అద్దె భవనాల జాబితా సిద్ధం చేస్తోంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై అధి కారులు ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఎన్నింటికి పక్కా భవనాలు ఉన్నాయి, అద్దె భవనాల్లో ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి, ప్రస్తుత పక్కా భవనాల పరిస్థితి ఏమిటి అనే దానిపై క్షుణ్ణంగా వివరాలు సేకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో స్థల సేకరణ కీలకం కానుంది.