వంతెన పనులకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

వంతెన పనులకు మోక్షం

Nov 13 2026 12:34 AM | Updated on Nov 13 2026 12:34 AM

రూ.23 కోట్లతో రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మాణం

ఆరు, నాలుగు లైన్లతో రోడ్లు

నగరంలో విశాలంగా మారనున్న రహదారులు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగరంలోని రాళ్లవాగు కాజ్‌వే స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. రూ.23కోట్లతో ఆరు వరుసల రోడ్డుగా బ్రిడ్జి పనులను ఈ నెల 10న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రారంభించారు. లక్ష్మి టాకీస్‌ చౌరస్తా నుంచి రాళ్లపేట్‌ బ్రిడ్జి మీదుగా రంగంపేట్‌ అప్రోచ్‌ రోడ్డు వరకు 1.3కిలోమీటర్ల దూరం ఆరు వరుసలు, పాత మంచిర్యాల నుంచి ఆండాళమ్మ కాలనీ వరకు 3.3 కిలోమీటర్ల దూరం వరకు ఆరు వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రాళ్లవాగు బ్రిడ్జి ఆండాళమ్మ కాలనీ నుంచి ఎంసీసీ వరకు నాలుగు వరుసలతో రోడ్డు, వంతెనల నిర్మాణానికి రూ.35కోట్లతో ప్రతిపాదనలు పంపించగా అనుమతి రావాల్సి ఉంది. రాళ్లవాగు కాజ్‌వే వద్ద బ్రిడ్జికి రూ.23కోట్లు కలిపి మొత్తంగా రోడ్ల కోసం రూ.225కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. సెప్టెంబర్‌లో ఒప్పందం కాగా, రెండేళ్లలో బ్రిడ్జితోపాటు రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. ఏడాదిలో పూర్తయ్యేలా ఎమ్మెల్యే పనులను వేగవంతం చేయిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో నగరంలోని రోడ్లు విశాలంగా మారడంతోపాటు అన్ని కాలనీలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు రోడ్ల నిర్మాణంతో ఊరట లభిస్తుంది.

రవాణా మెరుగు

నగరంలోని రాళ్లవాగుపై 2005లో రూ.80లక్షల వ్యయంతో వాగులో పైపులు వేసి కాజ్‌వే నిర్మించారు. దీనిపై పాతమంచిర్యాల, రంగంపేట్‌, ఆండాళమ్మ కాలనీ, పవర్‌సిటీ ప్రాంతాలకు ప్రజలు వెళ్లేవారు. కాజ్‌వే లో లెవల్‌లో ఉండడం, వర్షాకాలంలో వరదలకు కాజ్‌వే ప్రతియేటా కొట్టుకుపోవడంతో రెండు నెలలపాటు ఏటా రాకపోకలకు విఘాతం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రజలు రెండు నెలలపాటు కాజ్‌వే లేక పాతమంచిర్యాల నుంచి నాలుగు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించేవారు. వర్షాకాలం ముగిసిన వెంటనే తాత్కాలిక వంతెన ఏర్పాటుకు ప్రతియేటా నిధులు కేటాయించి పనులు చేస్తున్నారు. 2024 మార్చి 10న లోలెవల్‌ బ్రిడ్జి స్థానంలో రూ.13.50 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి టీయూఎఫ్‌ఐడీసీ(తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించడంలో జరిగిన ఆలస్యంతో నిర్మాణం ఆగిపోగా, ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు వరదల్లో కాజ్‌వే సగానికి పైగా కొట్టుకుపోయింది. వేంపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌, ఇండస్ట్రీయల్‌ హబ్‌లకు విశాలమైన రహదారుల ఏర్పాటుకు 2024 మార్చిలో ప్రారంభించిన హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనుల స్థానంలో రూ.23 కోట్లతో 222 మీటర్ల పొడవుతో ఆరు వరుసలు ఉండేలా 10 మీటర్ల ఎత్తు, 10 పిల్ల ర్లతో నిర్మాణానికి నిర్ణయించారు. గత నెలలో టెండరు పూర్తి చేసి ఎమ్మెల్యే చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. ప్రస్తుతం వాగులో నుంచి తాత్కాలిక రోడ్డు వేసి ప్రజల రాకపోకలకు వీలు కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement