బెల్లంపల్లి: ఎన్నికల సమయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇచ్చిన ప్రధాన హామీ ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా గెలిపిస్తే బెల్లంపల్లి కేంద్రంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఇచ్చిన హామీ మూడేళ్లు గడుస్తున్నా అమలు కాకపోవడం చర్చకు కారణమైంది. కనీసం క్యాంపు కార్యాలయంలోనైనా వరుసగా వారం రోజులు కూడా అందుబాటులో ఉండకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. బెల్లంపల్లిలో ఆర్టీసీ బస్‌డిపో, మెడికల్ కళాశాల మంజూరు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పనకు పరిశ్రమల స్థాపన, బెల్లంపల్లి రూపురేఖలు మారుస్తానంటూ మరెన్నో హామీలు ఇచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ నెరవేర్చకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
వేంకటేశ్వరస్వామి సాక్షిగా..
ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు వినోద్ స్థానిక అంశాన్ని పదే పదే ప్రచారం చేశారు. స్థానికుడు కాదని, గెలిపిస్తే అందుబాటులో ఉండరని, హైదరాబాద్ నుంచి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తారని ప్రచారాన్ని హోరెత్తించారు. దీంతో ప్రజలకు బలమైన భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే బెల్లంపల్లి సుభాష్‌నగర్ బస్తీలో కొ లువైన వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఇక్కడే ఉంటాన ని, ఇల్లు కట్టుకోవడానికి రెండు గుంటల భూమి కూడా చూశానని, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని బాండ్ పేపర్ రాసి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. దీంతో ఆయనపై నమ్మకం ఏర్పడి ఎన్నికల్లో గెలిపించారు. పదవి కాలం మూడేళ్లు గడుస్తున్నా హామీలు నెరవ్చేకపోవడంతో ప్రతిపక్ష నాయకులు అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు.


