మంచిర్యాలక్రైం: కమిషనరేట్ పరిధిలోని రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంచడంతోపాటు నేరాల నియంత్రణకు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్ ఆవరణలో గురువారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్‌స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంటు చర్యలు, నేర పరిశోధన తదితర అంశాలపై సమీక్షించారు. నమోదైన కేసులు, ప్రస్తుత పరిస్థితి, దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్ట్, చార్జిషీట్ దాఖలుపై తెలుసుకున్నారు. సీపీ మాట్లాడుతూ ప్రతీ ఘటనపై తక్షణమే స్పందించాలని అన్నారు. తమ పరిధిలో జరిగే ప్రతీ ముఖ్యమైన సంఘటనపై ముందస్తు అవగాహనతోపాటు సమగ్ర సమాచారం కలిగి ఉండాలని తెలిపారు. పోలీసు అధికారులు ఏమరుపాటుగా ఉంటే శాఖపరమైన చర్యలు ఉంటాయని అన్నారు.
పోలీస్ వాహనాల పరిశీలన
కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు వినియోగిస్తున్న వాహనాలను సీపీ అంబర్‌కిషోర్ ఝా పరిశీలించారు. వాహనాలు స్వయంగా నడిపి కండీషన్, సామర్థ్యాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు భాస్కర్, రాంరెడ్డి, అదనపు డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


