మంచిర్యాలఅర్బన్: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వీరగాథ 6.0 కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సత్తా చాటింది. విద్యార్థుల భాగస్వామ్యం, సృజనాత్మక ఎంట్రీలు, రిజిస్ట్రేషన్లలో ప్రథమ స్థానం సాధించింది. ఈ నెల 12వరకు రాష్ట్ర స్థాయి గణాంకాల ప్రకారం 775 రిజిస్ట్రేషన్లు జరుగగా అందులో 167 రిజిస్ట్రేషన్లతో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 1,788 సబ్మిషన్లలో 439తో ముందు వరుసలో ఉంది. రాష్ట్రస్థాయిలో నమోదైన 1485 ఎంట్రీల్లో 391ఎంట్రీలతో ప్రథమ స్థానం సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా 35,802 మంది విద్యార్థులు పాల్గొనగా మంచిర్యాల జిల్లా నుంచి 6,719 మంది భాగస్వాములయ్యారు.
ఎంపిక విధానం
గ్యాలంట్రీ అవార్డులు పొందిన వీర సైనికుల ధైర్యసాహసాలు, దేశరక్షణ కోసం వారు చేసిన త్యాగాలను నేటి తరం విద్యార్థులకు పరిచయం చేయడమే కార్యక్రమ ఉద్దేశ్యం. 3వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు కవితా రచన, వ్యాసరచన, చిత్రలేఖనం, పెయింటింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 3నుంచి ఐదో తరగతి విద్యార్థులు పాఠశాల స్థాయిలో ప్రతీ కేటగిరిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థుల ఎంట్రీలను మైగవ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. వీటి నుంచి జిల్లా స్థాయిలో నలుగురు, రాష్ట్రస్థాయిలో ఎనిమిది మందిని ఎంపిక చేస్తారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచిన 100 మందిని సూపర్ 100గా ఎంపిక చేసి రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేయనున్నారు.


