అటవీ శాఖ తీరుతో సాగుకు దూరం ఇటుకబట్టీలు, మిర్చి చేలలో పనికి ఒప్పందం మే వరకు అక్కడే.. చదువుకు దూరమవుతున్న చిన్నారులు
వేమనపల్లి: అందరికీ పట్టాలున్న సాగు భూములున్నాయి. కానీ వాటిని సాగు చేసుకునే యోగం లేదు. దీంతో బతుకు భారమై పనులు వెతుక్కుంటూ ఊరంతా వలసబాట పడుతున్నారు. ఇది మండలంలోని రాజారం గిరిజన గ్రామ దుస్థితి. గ్రామంలో సుమారు 80కుటుంబాలు, 280జనాభా ఉంది. వీరిలో 70మందికి గోధుమపేట శివారులో 3 సర్వే నంబర్లలో పట్టా భూములున్నాయి. 20ఏళ్ల క్రితం ఆ భూముల్లో ఐటీడీఏ సహకారంతో బోర్లు వేయించారు. కొందరు మామిడి, జీడి మామిడి చె ట్లు పెంచారు. ఇతర పంటలు సాగు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ భూములు తమవని అటవీ అధికారులు ఐదు సంవత్సరాలుగా సాగు చేసుకోనివ్వడం లేదు. దీంతో వారి బతుకు దుర్భరంగా మారింది.
వలసలే జీవనాధారం
సాగుకు దూరమైన వీరికి వలస బాటే జీవనాధారమైంది. సాగుకు నోచుకోని వీరంతా దినసరి కూలీ లుగా మారారు. ప్రతిరోజు కూలీ పనికి వెళ్తేనే కడు పు నిండేది. పనులు లేని సమయంలో డబ్బులు లేక మంచిర్యాల, జగిత్యాల, చెన్నూర్, సిరిసిల్ల ఇటుక బట్టీ వ్యాపారుల వద్ద, బడా మిర్చీ రైతుల వద్ద అ ప్పుకు డబ్బులు తెచ్చుకుంటారు. ఆ అప్పు బాకీ తీ ర్చేందుకు ఏటా వలసలు వెళ్తుంటారు. నవంబర్‌లో పనులకు వెళ్లి మే నెల వరకు అక్కడే ఉంటారు. పిల్లలతో సహా వలస వెళ్లి ఇటుక బట్టీల వద్ద కాలం వెళ్లదీస్తారు. దీంతో కొందరు పిల్లలు తమ చదువుకు దూరమవుతున్నారు.
భూమి లేకనే పోతున్నాం..
మాకు గోధుమపేటల పట్టా భూములున్నాయి. అటవీశాఖ వాల్లు దున్ననిస్తలేరాయే. ఇగ ఏం తిని బతుకుడు. రోజు కై కిల్ అన్న పోవాలె. పనులు లేకపోతే ఇటుక పనికో.. మిర్చీ కోతలకో ఊరిడిసి వలస పోవాలే. మా బాధలు చూసేటోళ్లు లేరు.
– నాయిని లక్ష్మయ్య,
రాజారం
బాకీ తీర్చడానికే..
పనులు లేనప్పుడు అందరం ఇటుక బట్టీల సేట్ల దగ్గర పైసలు తెచ్చుకుంటాం. అప్పు బాకీ తీర్చేటందుకు అందరం మల్ల మంచిర్యాల, ఇతర పట్టణాలకు వలసపోతం. నాయకులో, అధికారులో మా భూముల సమస్య పరిష్కరిస్తే మేమెందుకు వలసకు పట్నమ్ పోతం. ఊర్లోనే ఉండి పనులు చేసుకుంటాం.
– బుర్స శంకరయ్య, రాజారం


