నిర్మల్‌టౌన్: హైదరాబాద్‌లో ఈ నెల 17, 18, 19 తేదీల్లో నిర్వహించనున్న ఐదో తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో ప్రతిభ చాటేందుకు బాసర జోన్ క్రికెట్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. జోన్ పరిధిలోని నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన పోలీస్ క్రీడాకారులతో జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీల్లో భాగంగా క్లస్టర్–బీ పరిధిలో నిర్వహించనున్న టీ20 క్రికెట్ పోటీల్లో మొత్తం 21 జట్లు పాల్గొననున్నాయి. ఇందులో భాగంగా నిర్మల్ శివారులోని కొండాపూర్‌లో గల లక్కీ స్పోర్ట్స్ క్రికెట్ అకాడమీలో రెండు రోజులుగా బాసర జోన్ జట్లకు ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన మ్యాచ్‌లను ఎస్పీ జానకీ షర్మిల వీక్షించారు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం నిర్మల్‌కు వచ్చిన జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ కూడా క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొని పోలీస్ క్రీడాకారులతో కలిసి ఆడారు. రానున్న రాష్ట్రస్థాయి పోటీల్లో బాసర జోన్ జట్లు సమష్టి కృషి, క్రీడాస్ఫూర్తితో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్‌రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


