పేదరికాన్ని దాటి.. కలల తీరానికి చేరి.. | - | Sakshi
Sakshi News home page

పేదరికాన్ని దాటి.. కలల తీరానికి చేరి..

Oct 30 2026 11:55 PM | Updated on Oct 30 2026 11:55 PM

● ‘సాక్షి’ కథనానికి స్పందించిన దాతలు ● ఎంబీబీఎస్‌లో సాయిచరణ్‌ ప్రవేశం

బోథ్‌: చేతిలో చిల్లిగవ్వ లేక, ఫీజులు చెల్లించలేక ఆగిపోవాల్సిన ఎంబీబీఎస్‌ ప్రవేశం.. సమాజం చాటిన అపార మానవత్వంతో చిగురించింది. తల్లిదండ్రుల చేతులు పట్టుకుని, వారి కళ్లలోని ఆనంద భాష్పాలను తుడుస్తూ బోథ్‌ మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థి సాయిచరణ్‌ కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలోకి శుక్రవారం సగర్వంగా అడుగుపెట్టాడు. నీట్‌లో మంచి ర్యాంక్‌ సాధించినా ఆర్థిక స్తోమత లేక సాయిచరణ్‌ ఎదుర్కొంటున్న దీనస్థితిని వివరిస్తూ అక్టోబర్‌ 4న ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘డాక్టర్‌ కలకు పేదరికం అడ్డు’ కథనం అక్షరాలకే చలనం తెచ్చింది. సమాజంలోని మానవత్వాన్ని తట్టిలేపింది.

గాంధీ పూర్వ విద్యార్థుల చేయూత

కథనానికి చలించిన గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థులు డాక్టర్‌ రోహిణి వంగ (అమెరికా), డాక్టర్‌ విక్రమ్‌రెడ్డి, స్థానిక బోథ్‌ సామాజిక ఆరోగ్యకేంద్రం సూపరింటెండెంట్‌ రవీంద్రప్రసాద్‌ స్పందించారు. సాయిచరణ్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేయడానికి అవసరమయ్యే సుమారు రూ.5 లక్షల వ్యయాన్ని భరిస్తామని ప్రకటించి, తక్షణ సాయంగా రూ.50వేల చెక్కు అందజేశారు. రైస్‌ మిల్లు గుమా స్తా రాజా లక్ష్మణ్‌ దాస్‌ రూ.2,151 ఆర్థికసాయాన్ని అందించి మానవత్వాన్ని చాటారు. తమ బిడ్డ వైద్య విద్యకు తోడ్పాటునందించిన ‘సాక్షి’తోపాటు దాతలకు సాయిచరణ్‌ తల్లిదండ్రులు రమేశ్‌, విజయ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement