మంచిర్యాలక్రైం: వరుస తనిఖీలతో పోలీసులు హడలెత్తిస్తున్నారు. ఈ నెల 29న అర్ధరాత్రి స్థానిక ఏసీపీ ప్రకాశ్ ప్రత్యేక పోలీసులతో కలిసి జిల్లా కేంద్రంలోని స్మోకింగ్ జోన్లు, టీ పాయింట్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై ఏ పనీ లేకుండా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు నిర్వహిస్తున్న టీ పాయింట్ల యజమానులను మందలించారు. స్మోకింగ్ చేసేందుకు వచ్చిన యువకుల వివరాలు, వారి సెల్ నంబర్లు సేకరించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి అర్ధరాత్రి రోడ్ల మీద కనిపిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సీఐ ప్రమోద్‌రావు, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు రామకృష్ణ, మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.


