మంచిర్యాలటౌన్: ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించొద్దని, బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించాలని ఏఐసీసీ పరిశీలకులు మరియప్ప అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక శుభం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం, ఎన్నికల సంఘం తప్పిదాలకు శిక్షలు పడకుండా చట్టాలు రూపొందించారని మండిపడ్డారు. జీవనోపాధి కోసం వలస వెళ్లే సాధారణ ప్రజల ఓట్లు తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, జిల్లా ఆర్జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, హాజీపూర్ మండల అధ్యక్షుడు తోట రవి, లక్సెట్టిపేట పట్టణ అధ్యక్షుడు సయ్యద్ షాహిద్ అలీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు జాలే రాయలింగు, చాతరాశి రాజేశ్, డాక్టర్ సెల్ అధ్యక్షురాలు చందన, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


