శ్రీరాంపూర్: సింగరేణి సులభ్ కాంప్లెక్స్‌లలో పనిచేసే సఫాయి కర్మచారి కాంట్రాక్ట్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో జీఎం (పర్సనల్) కిరణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 35 నెలల డీఏ బకాయిలున్నాయని తెలిపారు. ప్రతీనెల 7వ తేదీన వేతనాలు చెల్లించాలని, చట్ట ప్రకారం కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ అమలు చేయాలని కోరారు. ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేసినట్లే 8.33 శాతం బోనస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 1, 2026న సింగరేణి యాజమాన్యం, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ, యూనియన్ నాయకులకు మధ్య జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని, లేని పక్షంలో లేబర్ కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మానందం, ప్రధాన కార్యదర్శి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.


