అసంపూర్తిగా ఎడ్యుకేషన్‌ కిట్లు | - | Sakshi
Sakshi News home page

అసంపూర్తిగా ఎడ్యుకేషన్‌ కిట్లు

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

● సగం వస్తువులతోనే సరి? ● విద్యార్థులకు తప్పని నిరీక్షణ ● జూనియర్‌ కళాశాలలకు యూనిఫాంలు ఆలస్యం

మంచిర్యాలఅర్బన్‌: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ కిట్లు పూర్తి స్థాయిలో పంపిణీ కాలేదు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా కిట్‌లోని అన్ని వస్తువులు అందలేదు. ప్రభుత్వం 21రకాల వస్తువులు అందించాలని నిర్ణయించగా.. ప్రస్తుతం పాఠ్య, నోట్‌ పుస్తకాలు, కార్పెట్‌, ప్లేట్‌, గ్లాస్‌ వంటి వస్తువులు మాత్రమే చేరాయి. ట్రంక్‌బాక్స్‌లు, ట్రాక్‌సూట్‌, నైట్‌డ్రెస్‌లు, పీటీ డ్రెస్‌, బూట్లు, సాక్స్‌, స్కూల్‌ బ్యాగులు, టవల్స్‌ పంపిణీపై స్పష్టత కొరవడింది. ఇంటర్‌ విద్యార్థులకు ఒక్క జత యూనిఫామ్‌ పూర్తిసాయిలో చేరని పరిస్థితి నెలకొంది.

157 పాఠశాలల నమూనా కిట్లు..

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులకు స్టూడెంట్‌ కిట్ల పంపిణీ జూన్‌ 19న అధికారికంగా ప్రారంభించారు. నోట్‌బుక్స్‌, యూనిఫాం, వస్తువులు, ఇతర విద్యాసామగ్రి అందజేశారు. గురుకుల విద్యార్థులకు 21రకాలు, హాస్టల్‌ విద్యార్థులకు 10రకాలు, డేస్కాలర్‌ విద్యార్థులకు 7 నుంచి వివిధ రకాల వస్తువులతో కూడిన కిట్లను ప్రభుత్వం పంపిణీ చేపట్టింది. జూన్‌లో నమూనాల కింద మూడు కేజీబీవీలు, టీబీసీ డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌(ఎంజేపీ)కు 19 కిట్లు, టీజీఎస్‌డబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌కు 8కిట్లు, జెడ్పీహెచ్‌ఎస్‌కు 109 కిట్లు, యూఆర్‌ఎస్‌కు 2 కిట్లు, మోడల్‌ స్కూళ్లకు 4, టీజీఎంఆర్‌ఈఐఎస్‌కు 12 కిట్లు చొప్పున పంపిణీ చేశారు.

యూనిఫామ్‌ లెక్కల్లో వ్యత్యాసం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటుబుక్స్‌, పాఠ్యపుస్తకాలు, షూ సాక్స్‌, బెల్ట్‌లు అందజేశారు. డీఆర్‌డీఏ, విద్యాశాఖ పంపిణీ చేసిన యూనిఫామ్‌లపై విద్యార్థుల సంఖ్య లెక్కల్లో వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది. పాఠశాల ప్రారంభంలో 43,072 మంది విద్యార్థులుండగా బడిబాట, విద్యాధికారుల చొరవతో మరో 3,566 మంది చేరారు. రెండో జతకు వచ్చే సరికి విద్యార్థుల సంఖ్య 46,566కు చేరింది. ఈ లెక్కన విద్యార్థులకు రెండో జత దుస్తులు అందించినా రెండు శాఖల మధ్య సంఖ్యపై పొంతన కుదరడం లేదని తెలుస్తోంది.

జూనియర్‌ కళాశాలకు ఆలస్యంగా..

ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌ల పంపిణీ నాలుగు నెలల ఆలస్యం తర్వాత ప్రారంభమైంది. జిల్లాలో 10 ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 2506, ద్వితీయ సంవత్సరంలో 2158 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఏకకాలంలో ఒక్కో జత యూనిఫాం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా మారాయి. యూనిఫామ్‌లు అందకపోవటంతో ఇన్నాళ్లూ సాధారణ దుస్తుల్లో కళాశాలకు రావాల్సి వచ్చింది. నాలుగు నెలల నిరీక్షణ తర్వాత ఒకట్రెండు కళాశాలల విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేయగా మిగతా విద్యార్థులకు ఎప్పుడు చేరుతుందో తెలియాల్సి ఉంది.

రవాణా చార్జీల భారం

గురుకులాలతోపాటు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల(కేజీబీవీ) విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ కిట్ల పంపిణీ క్షేత్రస్థాయిలో తలనొప్పిగా మారుతోంది. కిట్ల సామగ్రి, పుస్తకాల పంపిణీ సరఫరా అంతా కాంట్రాక్టర్‌ పాఠశాల స్థాయికి చేర్చాల్సి ఉన్నా మండలాలకు పంపిణీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. గురుకులాలకు ప్రభుత్వం నిర్వహణ ఖర్చుల కింద రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండగా కేజీబీవీలకు వెసులుబాటు లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కిట్లకు సంబంధించిన వస్తువులు పూర్తిగా ఒకేసారి రాకపోవడం, విడతల వారీగా రావడంతో ఎమ్మార్సీ నుంచి పాఠశాలలకు తెచ్చుకోవడం ప్రధాన సమస్యగా మారింది. నోట్‌పుస్తకాల నుంచి మొదలుకుని యూనిఫామ్‌ల వరకు ఏదైనా సరైన రవాణా నిధులు లేకపోవడంతో సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు కేజీబీవీలకు ప్రత్యేకంగా నిర్వహణ నిధులను బ్యాంకు ఖాతాలో జమ చేయడం, బియ్యం నుంచి మొదలుకుని ఇతరత్రా సామగ్రిని నేరుగా పాఠశాలలకు చేర్చితే రవాణా భారం తగ్గనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement