ఇది జిల్లా కేంద్రంలో తోళ్లవాగు వద్ద ఉన్న యూటర్న్. ఇక్కడా అనేక మంది రాంగ్ రూట్‌లో రోడ్డు దాటుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించుకుంటూ ట్రాఫిక్ నిబంధనలు లెక్క చేయడంలేదు.
ఇది జిల్లా కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ వంతెనపై ఏదైనా కారణంతో ట్రాఫిక్ నిలిచిపోతే వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డుగా వెళ్తూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నస్పూర్ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. జిల్లాలో పారిశ్రామిక ప్రాంతంతో పాటు జాతీయ రహదారుల కనెక్టివిటీతో నిత్యం వేలాది వాహనా లు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ, అనేక మంది ట్రాఫిక్ నియమాలను అతిక్రమిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. రాష్ట్ర పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ప్రత్యేకంగా రోడ్డు భద్రతల కోసం చేపట్టినా వాహనదారులు మారడంలేదు. ఫలితంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రతినెలా జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీల సమావేశాలు నిర్వహిస్తున్నా ప్రమాదాల తీవ్రత తగ్గడం లేదు.
పర్యవేక్షణ నామమాత్రమే..
జిల్లా వ్యాప్తంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే 27బ్లాక్‌స్పాట్ ప్రదేశాలున్నాయి. గతంలో కంటే వీ టి సంఖ్య తగ్గింది. అయినప్పటికీ మంచిర్యాల నగ ర పరిధి మంచిర్యాల, సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్ పరిధిలోనే ఏడు బ్లాక్‌స్పాట్‌లున్నాయి. మిగతావి ఎన్‌హెచ్ 63పై వేంపల్లి, ముల్కల బ్రిడ్జి, గుడిపేట, లక్సెట్టిపేట, జైపూర్, భీమారం చెన్నూరుతోపాటు మహారాష్ట్రకు వెళ్లే ఎన్‌హెచ్ 363 మందమర్రి, బెల్లంపల్లి, తాండూరు, వీటితోపాటు ఆదిలాబాద్, నిర్మల్‌కు వెళ్లే దండేపల్లి, జన్నారం మండలాల్లోనూ ఉన్నాయి. జాతీయ రహదారులతోపాటు మండలా లకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్లు, పంచాయతీలకు వెళ్లే రోడ్లు కూడా ఉన్నాయి. రోడ్డు రవాణా, రోడ్డు భవనాలు, ఇంజినీరింగ్, మున్సిపల్ ఇంజినీరింగ్, ఎన్‌హెచ్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పర్యవేక్షించాల్సి ఉంది. కానీ, శాఖల మధ్య సమన్వయం లో పించి నామమాత్రంగానే ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలు తరచూ జ రిగే బ్లాక్ స్పాట్లలో స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్, రేడి యం బ్లింకర్స్, స్టడ్స్, రంబుల్ స్టిక్స్, వేగనియంత్రణ సూ చికలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. చాలాచోట్ల రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యం కావడం లేదు. రోడ్డు భద్రతపై ఆటో, భారీ వాహనదారులకు మరింత అవగాహన కల్పించాల్సి ఉంది.
పరిమితికి మించి తీసుకెళ్తూ..
గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం, ఇతర పట్టణాలకు వెళ్లే క్రమంలో ఆటోలు, ప్రైవేట్ ట్రావెల్స్‌వారు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళ స్కూల్ విద్యార్థులు, వివిధ పనుల కోసం వెళ్లేవారు ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణిస్తున్నారు. రోడ్డు రవాణా అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్రత పెరుగుతోంది. చాలా వాహనాలకు ఇన్సూరెన్స్ కూడా లేక బాధితులకు పరిహారం అందే అవకాశం లేకుండా పోతోంది. సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇష్టారీతిన యూటర్న్‌లు
ఎన్‌హెచ్ 63పై జిల్లా కేంద్రం నుంచి మొదలు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వరకు ఇష్టారీతిన యూటర్న్‌లు వెలిశాయి. జాతీయ రహదారిపై నిబంధనల మేరకే ఐబీ చౌరస్తా నుంచి 100–200 మీటర్ల వ్యవధిలోనే యూటర్న్‌లున్నాయి. దీంతో ఎక్కడపడితే అక్కడ వాహనదారులు యూటర్న్ తీసుకుంటుండగా ఎదురుగా వచ్చే వాహనాలతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. తాజాగా నస్పూర్ గేటు వద్ద ఏర్పాటు చేసిన యూటర్న్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిందే.
ఇది జిల్లా కేంద్రంలోని రైల్వే బ్రిడ్జి వద్ద చున్నంబట్టి వైపు వెళ్లే యూటర్న్. ఇక్కడ ఇష్టారీతిన రాంగ్ రూట్‌లలో వాహనదారులు వెళ్తున్నారు. బ్రిడ్జి పైనుంచి వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదం జరిగే అవకాశముంది.


