మంచిర్యాలక్రైం/భీమిని/భీమారం: పలువురు ఆటో డ్రైవర్లు కాసుల కోసం కక్కుర్తి పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఆటో ముందు సీటులో డ్రైవర్, వెనుక సీటులో ముగ్గురు ప్రయాణికులు కూర్చోవాలి. కానీ, పలువురు ఆటో డ్రైవర్లు ముందు సీటులో తనతోపాటు మరో ముగ్గురిని, వెనుక సీటులో ఐదుగురిని ఎక్కించుకుని ప్రమాదకర రీతిలో వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలోని నస్పూర్ గేటు సమీపంలో ఈ నెల 28న జరిగిన రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం అతి వేగంతోపాటు పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను తరలించడమేనని స్థానికులు, అధికారులు చెబుతున్నారు. ఘోర ప్రమాదం జరిగినా ఆటో డ్రైవర్లలో మార్పు లేదు. కన్నెపల్లి మండల కేంద్రంలోని ఓ స్కూల్ విద్యార్థులు మంగళవారం ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణించారు. వివిధ గ్రామాల నుంచి డ్రైవర్ తన ఆటోలో విద్యార్థులను పరిమితికి మించి పాఠశాలకు తీసుకెళ్లాడు. భీమారం మండలంలో నర్సింగాపూర్, భీమారంలోని పాఠశాలలకు విద్యార్థులు నిత్యం ఆటోల్లోనే వచ్చి వెళ్తుంటారు. భీమారం నుంచి కాజిపల్లి, ఆవిడం మీదుగా మందమర్రికి ఆర్టీసీ బస్సు నడుస్తున్నా అది విద్యార్థులకు సౌకర్యంగా ఉండకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు ఆటోలు మాట్లాడి పంపిస్తున్నారు. కానీ, ఆటో డ్రైవర్లు పరిమితికి మించి విద్యార్థులను ప్రమాదకర రీతిలో తీసుకువెళ్తున్నారు. ఇప్పటికై నా పోలీస్, రవాణాశాఖల అధికారులు స్పందించి నిబంధనలు పాటించని, పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
భీమారం: మద్దికల్ నుంచి భీమారానికి ఇలా..
భీమిని: ఆటోలో ప్రమాదకరంగా వెళ్తున్న విద్యార్థులు


