ఆస్తి కోసం అంతమొందించారు..! | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం అంతమొందించారు..!

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

వేమనపల్లి: ఆస్తి తగాదాలు ఓ అన్నను కసాయిగా మార్చాయి. సొంత తమ్ముడినే అడ్డు తొలగించుకునేందుకు గుప్త నిధుల వేటకు పిలిచి దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. సోమవారం చెన్నూరురూరల్‌ సీఐ కార్యాలయంలో జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. నీల్వాయి గ్రామానికి చెందిన అన్న కుడుకల రాజేశ్‌ తమ్ముడు శ్రీనివాస్‌కు మధ్య వ్యవసాయ భూమి, ఇంటి స్థలాల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. తమ్ముడిని చంపేందుకు తనకు బావమరిది చెన్నూరు మండలం చాకపల్లికి చెందిన గోదారి సమ్మయ్యతో కలిసి రాజేశ్‌ వ్యూహరచన చేశాడు. పతకం అమలు చేసేందుకు చాకపల్లి గ్రామానికి చెందిన బల్ల కిష్టస్వామిని వెంట తెచ్చుకున్నారు. హత్యకు ముందే రాజేశ్‌ పలు దఫాలుగా సమ్మయ్యకు రూ.95,000 ముట్టజెప్పాడు. ఈనెల 20వ తేదీన సోమనపల్లి అటవీ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయని శ్రీనివాస్‌ను నమ్మించి చెన్నూర్‌కు పిలిపించుకొన్నారు. బస్టాండ్‌ సమీపంలోని వైన్స్‌ వద్ద సమ్మయ్య, శ్రీనివాస్‌ కలిసి మద్యం సేవించారు. కిష్టస్వామితో కలిసి అటవీ ప్రాంతంలోకి నడుచుకుంటూ వెళ్తుండగా సమ్మయ్య తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో వెనుక నుంచి వచ్చి శ్రీనివాస్‌ మెడపై, కాళ్లపై దాడి చేశాడు. ఆనవాళ్లు దొరకకుండా మృతదేహంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పరారయ్యారు. 21వ తేదీన రాజేశ్‌ నుంచి ఒప్పందం ప్రకారం మరో రూ.లక్ష నగదు తీసుకున్నారు. 21న మృతుడి భార్య శారద నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ప్రత్యేక పోలీస్‌ బృందాలతో గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో చెన్నూర్‌ బస్టాండ్‌ వద్ద సమ్మయ్యను, అస్నాధ చౌరస్తా వద్ద ప్రధాన సూత్రధారి రాజేశ్‌, కిష్టస్వామిని అరెస్టు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 60 వేల నగదు, గొడ్డలి, నిందితులకు చెందిన రెండు బైకులు, సెల్‌ఫోన్లు, రక్తపు మరకలు ఉన్న దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మిస్సింగ్‌ కేసును ఛేదించిన చెన్నూరు రూరల్‌ సీఐ కృష్ణ, ఎస్సైలు నాగరాజు, రాజశేఖర్‌, రాజేందర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శంకర్‌, బుజ్జిబాబు, కానిస్టేబుళ్లు రవి, భరత్‌, వెంకన్న, రాజేందర్‌లను ఏసీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement