భీమారం: మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు శుక్రవారం గండి పడింది. దీంతో నీళ్లు వాగులోకి వెళ్లాయి. కాలువకు అక్కడక్కడ చిన్న చిన్న బుంగలు ఏర్పడ్డా మరమ్మతు చేయడంలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. భీమారం నుంచి ఎలకేశ్వరం వరకు సిమెంట్ కాలువ నాసిరకంగా నిర్మించడంతో పగుళ్లు తేలాయి. ఎలకేశ్వరం గ్రామ సమీపంలో రెండేళ్ల క్రితం కాలువకు గండి పడగా ఇప్పటికీ మరమ్మతు చేయలేదు. కాగా, ఇసుక బస్తాలతో గండి పూడ్చే పనులు చేపట్టినట్లు గొల్లవాగు ప్రాజెక్ట్ డీఈ రామకృష్ణ తెలిపారు.


