మంచిర్యాలఅగ్రికల్చర్: ఎల్‌నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడుస్తున్నాయి. వ్యవసాయానికి బోరుమోటార్లు నీటిని ఎత్తి పోస్తున్నాయి. విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతుండడంతో మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. జిల్లాలో వేసవి కాలాన్ని మించి విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 14నుంచి 15శాతం మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నా ఎండలు, ఉక్కపోత తీవ్రత తగ్గడం లేదు. గత మే నెలలో 3.214 మిలియన్ యూనిట్లు వినియోగం కాగా ఈ సెప్టెంబర్‌లో 3.409 మిలియన్ యూనిట్లకు చేరడం గమనార్హం. అన్ని కేటగిరిల్లో విద్యుత్ వినియోగం పెరగడంతో జిల్లాలో 132 కేవీ సబ్‌స్టేషన్లపై అధిక భారం పడుతోంది.
బోర్లు ఎత్తిపోస్తున్నాయి..
జిల్లాలో 3.10 లక్షల ఎకరాల్లో పత్తి, వరి తదితర పంటల సాగు విస్తీర్ణం ఉంది. వరి సాగు ఆలస్యం కావడం, ప్రస్తుతం పంట ఎదిగే దశలో ఉండగా ఉష్ణోగ్రతలు పెరగడం, వేడిమితో నీరు ఇంకిపోతోంది. దీంతో బోరుమోటార్లు ఎత్తి పోస్తున్నాయి. పంటల సంరక్షణ కోసం రైతాంగం బోరుబావుల మోటార్లను విస్తృతంగా వినియోగిస్తుండడంతో కరెంటు డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఈ ఏడాది వినియోగం పెరగడం గమనార్హం. వరి పంట దిగుబడి నవంబర్ మొదటి వారం వరకు వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్‌లో వర్షాలు లేకుండా ఉష్ణోగ్రతలు పెరిగితే రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు త్రీఫేజ్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
వర్షాకాలం ఈదురుగాలులు, చల్లని వాతావరణం ఉండాల్సి ఉండగా.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి ప్రతాపం నుంచి జూన్, జూలైలో కురిసిన భారీ వర్షాలకు చల్లని వాతావరణం, పచ్చిక బయలు, చెట్లు, పంట పొలాలతో ఆగస్టు నుంచి వాతావరణంలో మార్పులు ఉండాలి. కానీ వానాకాలం ముగింపు దశకు వస్తున్నా జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు 30నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉదయం ఎండ, ఉక్కపోత కొనసాగితే సాయంత్రం వర్షం కురుస్తుంది. మరుసటి రోజు ఎండ, ఉక్కపోత కొనసాగుతోంది. వేడెక్కుతున్న వాతావరణంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్ 5నుంచి 10వరకు ఈ ఏడాది ఇదే రోజుల్లో పోలిస్తే అన్ని రోజుల్లోనూ అధికంగా నమోదైంది.
జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు
గృహ 2,75,948
వ్యవసాయ 51,284
వ్యాపార 35,361
స్ట్రీట్‌లైట్, వాటర్‌వర్క్ 6,392
జనరల్ పర్పస్ 2,454
ఇండస్ట్రీయల్ 1,496
టెంపవరీ 322
స్మాల్ ఇండస్ట్రీస్ 77
మొత్తం 3,73,334
గతేడాది, ఈ ఏడాది సెప్టెంబర్‌లో విద్యుత్ వినియోగం(మిలియన్ యూనిట్లలో)
తేదీ 2025 2026 పెరుగుదల
5 2.463 3.342 0.879
6 2.854 3.213 0.359
7 3.150 3.409 0.259
8 3.271 3.309 0.38
9 2.874 3.376 0.502
10 2.872 3.287 0.417
జిల్లాలో సాగు విస్తీర్ణం(ఎకరాల్లో)
పత్తి 1,72,160
వరి 1,34,901
కంది 1,559
పెసలు 353
మొక్కజొన్న 153
కూరగాయలు 843
ఆయిల్‌ఫామ్ 448
నువ్వులు 09
మినుములు 09
మొత్తం 3,10,435


