మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సిబ్బందికి సూచనలు, అవగాహన కల్పించడంతోపాటు అజాగ్రత్త వహిస్తే రూ.3 వేల జరిమానా విధిస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కే.వరుణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలో పాత మంచిర్యాల, లక్సెట్టిపేటలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్లు, జిల్లాస్టోర్స్, మంచిర్యాల హైటెక్‌సిటీ ఏరియాలోని ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో సర్కిల్ కార్యాలయం నిర్మాణం, అమవీరుల స్తూపం స్థలాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా, ఫీడర్ల పనితీరు, లోడ్ పరిస్థితిపై ఽఅధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం, ఉష్ణోగ్రతల తీవ్రతతో జిల్లాలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్నా రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. డిసెంబర్‌లోగా దండేపల్లి మండలం తాళ్లపేట, జైపూర్ మండలం రసుల్‌పల్లి 132 కేవీ సబ్‌స్టేషన్లు అందుబాటులో వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ మల్లయ్య, ఎస్‌ఈ రాజన్న, డీఈ ఖైసర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీహరి, ఈఈ రవికుమార్, డీఈ గులాబ్, ఏడీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.


