మంచిర్యాలరూరల్(హాజీపూర్)/మంచిర్యాలఅర్బన్: తీరొక్క రూపాల్లో వినాయక విగ్రహాలు సిద్ధమయ్యాయి. 14న వినాయక చవితి పండుగ ఉండటంతో కళాకారుల చేతిలో తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. నిజామాబాద్, మహారాష్ట్ర నుంచి వచ్చిన కార్మిక కుటుంబాలు మంచిర్యాల, వేంపల్లి శివారు తదితర ప్రాంతాల్లో గత రెండు నెలలుగా ఉంటూ విగ్రహాలను తయారు చేస్తున్నాయి. ఐదు అడుగుల నుంచి 12 అడుగుల ఎత్తు వరకు ఆకర్షణీయమైన రంగుల్లో సిద్ధం చేశారు. ఎలుక, సింహం, నెమలి వాహన గణపతులతోపాటు రాధాకృష్ణ, నందీశ్వర, పార్వతీ, పరమేశ్వర, ఆంజనేయస్వామి సహిత గణపయ్య విగ్రహాలను తయారు చేశారు. విగ్రహాలను మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, చెన్నూర్, సీసీసీ, శ్రీరాంపూర్, భీమారం, జైపూర్, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలకు తీసుకెళ్తున్నారు. రూ.3 వేల నుంచి రూ.50 వేల వరకు ధర పలుకుతున్నాయి.
35 ఏళ్లుగా విగ్రహాలు చేస్తున్నం
మంచిర్యాలలో గత 35 ఏళ్లుగా వినాయక, దుర్గాదేవి విగ్రహాలను తయారు చేస్తున్నాం. మొదట మట్టి విగ్రహాలు తయారు చేసినా పోటీ తట్టుకోలేక ప్లాస్టర్ ఆఫ్ పారీస్‌తో అందమైన, రంగురంగుల విగ్రహాల తయారీ ప్రారంభించాం. విగ్రహాలు హానికారకం కాకుండా మట్టి, సిమెంట్, కొబ్బరిపీచుతో తయారు చేస్తున్నాం. కుటుంబ సభ్యులమంతా కలిసి విగ్రహాల తయారీ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం.
– కె.సత్తిబాబు, విగ్రహాల తయారీదారు, వేంపల్లి


