మంచిర్యాలక్రైం: అటవీ సంపద, పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం మూడో విడత వన మహోత్సవం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 75శాతం లక్ష్యం పూర్తయింది. ఈసారి వర్షాల కారణంగా మొక్కలు నాటడం ఆలస్యంగా ప్రారంభమైంది. జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ ఏడాది 41.11లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం విధించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 306 గ్రామ పంచాయతీల్లో, అటవీశాఖ ఆధ్వర్యంలో 10 నర్సరీల్లో ఉపాధి హామీ పథకం కింద మొక్కలు పెంచారు. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతీ నర్సరీలో బోర్లు ఏర్పాటు చేసి విత్తనం నాటిన నుంచి మొలకెత్తి మొక్కగా నాటేందుకు అనువుగా పెరిగేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎండ వేడి తగలకుండా పందిళ్లు, గ్రీన్‌మ్యాట్ ఏర్పాటు చేశారు. 24గంటలు నీరందించేలా ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలను నియమించారు.
సంరక్షణపై అశ్రద్ధ
2025 ఆర్థిక సంవత్సరంలో వన మహోత్సవం పేరిట జిల్లాలో 49.04లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం విధించగా.. 46,02,180 మొక్కలు నాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 40శాతం మొక్కలు ఇళ్లలో నాటేందుకు ప్రతీ ఇంటికి ఆరు చొప్పున పంపిణీ చేసినట్లు లెక్కలున్నాయి. మరికొన్ని రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఖాళీ స్థలాల్లో, మున్సిపల్ పార్కులు, కాలువ గట్ల వెంట, రోడ్లకు ఇరువైపుల, పాఠశాలల్లో మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతీ ఇంటికి పంపిణీ చేసిన మొక్కలు నాటారో లేదో అధికారులు పట్టించుకోలేదు. రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ స్థలాల్లో నాటిన మొక్కలు ఎక్కడా ఆనవాళ్లు కనిపించడం లేదు. ఈసారి కూడా ప్రతీ ఇంటికి ఐదారు మొక్కల పంపిణీకి ఆయా శాఖల క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నీడనిచ్చే, పండ్లు, పూలమొక్కలు అందజేతకు చర్యలు తీసుకుంటున్నట్లు ఓ అధికారి తెలిపారు. కానీ ఇప్పటివరకు మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టలేదు. మొక్కలు నాటడంలో చూపించే హంగామా వాటి సంరక్షణలో చూపడం లేదన్న విమర్శలున్నాయి.
జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో మూడేళ్ల క్రితం హరితహారంలో భాగంగా కార్యాలయ ముఖద్వారం ఎడమ పక్కన అప్పటి జిల్లా అటవీ శాఖ అధికారి శివానిడోగ్ర ఆధ్వర్యంలో సుమారు 50 మొక్కలు నాటారు. అందులో ఒక్కటీ బతకకపోవడం గమనార్హం. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో మొక్కలనే సంరక్షించని అధికారులు బయట చెట్లు, మొక్కలను ఎలా సంరక్షిస్తారనే విమర్శలు వస్తున్నాయి.
2022 జూలైలో మంచిర్యాల ఏసీసీ సమీపంలో మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్లే రహదారి పక్కన మున్సిపాల్టీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సుమారు 150 మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ పేరిట నాటారు. వాటి సంరక్షణకు చుట్టూ ప్లాస్టిక్ గార్డులు ఏర్పాటు చేశారు. అందులో ఒక్క మొక్క దక్కలేదనడానికి ఈ చిత్రమే నిదర్శనం. ఈ ప్రాంతంలో రెండుసార్లు మొక్కలు నాటినట్లు స్థానికులు చెబుతున్నారు.


