దసలి పట్టు సాగుకు ప్రభుత్వం సుముఖం
జీవో జారీపై గిరిజన రైతుల హర్షం
రెండో పంటకు సన్నద్ధం
చెన్నూర్: దసలి పట్టు సాగుపై గిరిజన రైతులకు ఎట్టకేలకు ‘పట్టు’ దక్కింది. అటవీ ప్రాంతంలో సాగుకు అనుమతినిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జిల్లా పరిధిలోని దసలి పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో సుమారు 80ఏళ్లుగా గిరిజన ఆదివాసీ కుటుంబాలు పట్టు కాయలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. గత రెండేళ్లుగా జిల్లాతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో దసలి పట్టు సాగు చేయొద్దంటూ అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో వందలాది మందికి ఉపాధి కరువైంది. దసలి పంట లేకపోతే దశాబ్దాల చరిత్ర కనుమరుగయ్యే అవకాశం ఉండడంతో అధికారులు ముమ్మర ప్రయత్నం చేశారు. దీంతో ఈ నెల 5న ప్రభుత్వం జీవో 83 విడుదల చేసింది. అటవీ ప్రాంతంలో గతంలో మాదిరిగా గిరిజనులు దసలి పంట సాగు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. దీంతో అటవీ ప్రాంతంలో టసార్ సాగుకు స్పష్టమైన ప్రభుత్వ అనుమతి, కార్యాచరణ విధానం ఏర్పడింది. అటవీ ప్రాంతాలపై ఆధారపడి జీవించే గిరిజన కుటుంబాలకు టసార్ పరిశ్రమ ద్వారా స్థిరమైన జీవనోపాధి, అదనపు ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. మంచిర్యాల–చెన్నూర్ ప్రాంతంలో టసార్ విస్తరణకు ఈ జీవో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే సంబంధిత డీఎఫ్‌వో అనుమతి, నిర్ధేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. జీవో జారీతో గిరిజన రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
జీవోలోని అంశాలు
సంతోషంగా ఉంది..
దసలి పట్టు సాగు కోసం ప్రభుత్వం జీవో విడుదల చేయడం సంతోషంగా ఉంది. రెండేళ్లుగా పంట లేక ఉపాధి కోల్పోయిన రైతులకు ఈ జీవో మేలు చేస్తుంది. వచ్చే నెలలో దసలి పట్టు కాయలను పండించేందుకు రెండో పంటకు రైతులు సిద్ధంగా ఉన్నారు. రెండో పంట సాగు చేస్తే చెన్నూర్ పట్టు పరిశ్రమ పరిధిలో 60, 70 లక్షల పట్టు కాయ దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
– పార్వతి రాథోడ్, సెరికల్చర్ ఏడీ


