దండేపల్లి: మండలంలోని నెల్కివెంకటాపూర్‌లో మంగళవారం రాత్రి జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన సింగతి రమేశ్, అతని తల్లి రాంబాయి కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. రమేష్‌కు వరుసకు వదిన అయిన సింగతి లక్ష్మి మంత్రాలు చేయడంతోనే తమకు ఇలా జరుగుతుందని భావించిన తల్లీ కొడుకులు ఆమెను చంపేందుకు పథకం వేశారు. మంగళవారం రాత్రి లక్ష్మి భర్త లచ్చన్న ఇంట్లోలేని సమయంలో గొడ్డలితో దాడిచేసి పరారయ్యారు. బుధవారం గూడెం వద్ద నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. మృతురాలి భర్త లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నామన్నారు.


