కాసిపేట: మందమర్రి ఏరియా కాసిపేట–2 గనిపై అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ.. పేలుడు పదార్థం నాణ్యత లోపించడంతోనే సోమవారం ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రాణాలు పోయేదాకా అధికారులు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. పేలుడు పదార్థం నాణ్యతగా లేదని చెబితే కంపెనీ మార్చకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. గని ప్రమాదంలో నలుగురు గాయపడటానికి పేలుడు పదార్థం, వినియోగించే తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న కేకే గ్రూపు ఏజెంట్ ఖాదిర్ కార్మికులకు నచ్చజెప్పారు. పేలుడు పదార్థాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రయోగాత్మకంగా పలు కంపెనీలు, పద్ధతులను అవలంబిస్తున్నట్లు తెలిపారు. సోమవారం గనిలో జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. సంఘటనలో కార్మికుల తప్పిదం లేదని, మెటీరియల్ తదితర అంశాలన్నింటిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. గని మేనేజర్‌తో ఇబ్బందులు రాకుండా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏజెంట్ హామీతో ఆందోళన విరమించిన కార్మికులు.. మరోసారి ఇలా జరిగితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సపోర్ట్‌మెన్, కోల్‌కట్టర్, అన్ని వర్గాల కార్మికులు పాల్గొన్నారు.


