రెండ్రోజుల నుంచి 30రోజుల వరకు.. ‘క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్’గా బోథ్, సొనాల మండలాల్లోని అడవులు తిప్పేశ్వర్ నుంచి ‘కవ్వాల్’ వరకు పులులకు ఆవాసంగా వలస దారి!
బోథ్: మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్ వైపు సాగే పెద్దపులుల వలసలకు బోథ్, సొనాల అటవీ శ్రేణులు అత్యంత కీలక అంతర్రాష్ట్ర ప్రధాన మైలురాయిగా మారాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం నుంచి పెన్‌గంగ నదిని దాటుకుంటూ ఇక్కడి అడవుల్లోకి ప్రవేశిస్తున్న పెద్దపులులు గతంలోలాగా వెళ్లిపోవడం లేదు. ఇక్కడి అటవీ పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉండటంతో ఏకంగా 20నుంచి 30రోజుల వరకు మకాం వేస్తున్నాయి. లోతట్టు అడవుల్లోని చెరువులు, సహజసిద్ధమైన వాగుల రూపంలో పుష్కలంగా దొరుకుతున్న నీటి వనరులు, శాకాహార జంతువుల రూపంలో లభిస్తున్న ఆహారం పెద్దపులులను ఇక్కడే తిష్టవేసేలా చేస్తున్నాయి. ఈ కీలక పరిణామాలను గుర్తించిన అటవీశాఖ సొనాల మండలంలోని చింతల్‌బోరి, వజ్జర్, ఘన్‌పూర్‌తోపాటు బోథ్ మండలంలోని పలు అటవీ ప్రాంతాలను అధికారికంగా ‘క్రిటికల్ టైగర్ హ్యాబిటాట్’ (క్లిష్టమైన పులుల ఆవాసం), ‘హై కాన్‌ఫ్లిక్ట్ వైల్డ్‌లైఫ్ కారిడార్’గా గుర్తించింది.
తిప్పేశ్వర్ నుంచి కవ్వాల్‌కు వయా..
బోథ్, సొనాల మండలాల పరిధిలోని దట్టమైన అడవులను పెద్దపులులు తమ సహజ వలస దారిగా మార్చుకున్నాయి. గతంలో అసలే పులుల జాడలేని ఈ ప్రాంతాల్లో నాలుగేళ్ల నుంచి రాకపోకలు మొదలయ్యాయి. మూడేళ్లుగా తిప్పేశ్వర్ నుంచి కవ్వాల్ టైగర్ జోన్‌కు వెళ్లే పెద్దపులులు పక్కా మార్గాన్ని ఏర్పరుచుకున్నాయి. మహారాష్ట్ర సరిహ ద్దు నుంచి ఘన్‌పూర్, చింతలబోరి, చింతగూడ, నేరేడుపల్లె, కంటేగాం, నిగిని, మర్లపెల్లి అటవీ ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తూ, అక్కడి నుంచి పిప్పల్‌ధరి, నారాయణపూర్, రఘునాథ్‌పూర్, నాగాపూర్ గ్రామాల పరిధిలోని అడవులను దాటుకుని నిర్మల్ ఘాట్ ద్వారా కవ్వాల్ టైగర్ జోన్‌లోకి ప్రవేశిస్తున్నాయి.
వలస దారే ఆవాసంగా..
గతంలో తిప్పేశ్వర్ నుంచి బయలుదేరిన పులులు ఈ మార్గంలో రెండు లేదా మూడు రోజులే ఉండి కవ్వాల్ వైపు వెళ్లిపోయేవి. కానీ, రెండేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పులులు ఏకంగా 30 రో జుల పాటు ఇక్కడే గడుపుతున్నాయి. ముఖ్యంగా ఘన్‌పూర్, చింతలబోరి, వజ్జర్, పెద్దగూడ, కంటేగాం పరిసరాల్లో నెలపాటు స్థిరంగా సంచరిస్తున్న ట్లు అటవీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. లోతట్టు అడవుల్లోని చింతలబోరి చెరువు, వాగులు వేసవిలోనూ ఎండిపోకుండా నీటిని అందిస్తుండటం, దట్టమైన కొండగుట్టలు విశ్రాంతికి, వేటకు పూర్తి అనుకూలంగా ఉండటంతో పులులు ఈ ప్రాంతాన్ని తమ శాశ్వ త స్థావరంగా మార్చుకుంటున్నాయి.
పెద్దగూడ వద్ద టైగర్ క్రాసింగ్ జోన్లు
పులులు తమ ఆవాసాల నుంచి కదిలే క్రమంలో వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ రహదారులను దాటాల్సి వస్తోంది. దీంతో మనుషులు–వన్యప్రాణుల మధ్య ఘర్షణ (మ్యాన్–యానిమల్ కాన్‌ఫ్లిక్ట్) ముప్పు తీవ్రస్థాయిలో పొంచి ఉంది. రహదారులు దాటే సమయంలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అటవీశాఖ పెద్దగూడ, వజ్జర్ ప్రాంతాల్లోని ప్రధాన రోడ్లపై అధికారికంగా ‘టైగర్ క్రాసింగ్ జోన్లు’ ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు అమర్చింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు రాత్రి, వేకువజాము వేళల్లో వేగాన్ని నియంత్రించుకోవాలని, పొలాల వద్ద రైతులు ఒంటరిగా తిరగొద్దని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా ముమ్మరం చేశారు.


