సాత్నాల: భోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన బొజ్జ రాజు (27) మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు కూలీ పని చేసేవాడు. మద్యానికి బానిసై గతంలో రెండు, మూడుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి బయటి నుంచి ఇంటికి వచ్చిన రాజు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కేకలు విన్న తల్లిదండ్రులు మంటలార్పారు. వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే 80శాతం కాలి తీవ్రంగా గాయపడ్డాడు. రెండ్రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స అందించినా ఎలాంటి ఉపయోగం లేదని వైద్యులు వెల్లడించగా కుటుంబ సభ్యులు రాజును ఇంటికి తీసుకెళ్లారు. నాలుగు రోజులపాటు ప్రాణాలతో పోరాడిన రాజు మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడికి వివాహమైనా మద్యానికి బానిసగా మారడనే కారణంతో అతడి భార్య మూడేళ్ల క్రితమే పుట్టింటికి వెళ్లిపోయింది.


