సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో అర్హులైన పౌరుల ఏ ఒక్కరి ఓటు హక్కు తొలగించబోమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా 22ఏ జాబితాలో ప్రైవేటు పట్టా, ఆస్తులను చేర్చలేదని వివరించారు. అన్‌మ్యాపింగ్, అనామలీస్ ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నామని, ఓటర్లు సకాలంలో స్పందించి బీఎల్‌వోలకు డాక్యుమెంట్లు సమర్పించాలని కోరారు. జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు పరిశీలన(ఎస్‌ఐఆర్), నిషేధిత జాబితా 22ఏపై బుధవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
1.70లక్షల మంది ఓటర్లకు నోటీసులు
జిల్లాలో 1,36,985మంది ఓటర్ల వివరాలు అనామలీస్ కేటగిరీలో ఉన్నాయి. అలాగే 33,983మంది అన్‌మ్యాపింగ్ ఓట్లు ఉన్నాయి. మొత్తంగా 1,70,967మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తాం. వీటికి సంబంధించి ఫాంలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 74,797మంది ఓటర్లకు బీఎల్‌వోలు నోటీసులు అందజేశారు. మిగతా నోటీసులు త్వరితగతిన అందుతాయి. నోటీసులు అందుకున్న ఓటర్లకు విచారణ జరిపి తగిన డాక్యుమెంట్లు అందజేస్తే పరిశీలిస్తున్నారు. అయితే చాలామంది సరైన డాక్యుమెంట్లు జత చేయడం లేదు. దీంతో మరోసారి ఓటర్లకు సమాచారం అందిస్తున్నాం. అనామలీస్ ఓటర్లకు ఎన్నికల కమిషన్ సూచించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగాలు జారీ చేసే గుర్తింపు కార్డు లేదా పింఛన్ కార్డు, 1987కు ముందు బ్యాంకు పాస్‌బుక్, పాస్‌పోర్టు, విద్యార్హత ధ్రువీకరణ పత్రం, రెసిడెన్స్ సర్టిఫికెట్, అటవీ హక్కుల పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, సిటిజన్ సర్టిఫికెట్, ఫ్యామిలీ రిజిష్టర్, పట్టాదారు పాస్ పుస్తకంలో ఏదో ఒక డాక్యుమెంట్ తప్పనిసరిగా చూపించాలి. కానీ చాలామంది ఈ ధ్రువీకరణ లేవని చెబుతున్నారు.
వేగంగా పరిశీలన
జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల పరిధిలో ఈఆర్వోలు, తహసీల్దార్లు, ఇతర సిబ్బంది ఓటరు పరిశీలన ప్రక్రియను వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. రోజుకు కనీసం 4వేల ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నాం. చాలామంది ఓటర్లు ఎన్నికల కమిషన్ పేర్కొన్న ధ్రువీకరణలు తమ వద్ద లేవని మా దృష్టికి తెస్తున్నారు. కానీ తగిన ధ్రువీకరణ పత్రాలు రుజువుగా చూపకపోతే తుది జాబితాలో ఓటరుగా చేర్చలేం. అందుకు నిబంధనలు అనుమతించవు. ఓటరు పేర్లలో తప్పొప్పులు, చిన్న చిన్న తప్పిదాలను సరి చేస్తున్నాం. కొందరికి ఎలాంటి ధ్రువీకరణ లేకపోవడం, 1987కంటే ముందు నాటి డాక్యుమెంట్లు జత చేయాలనే నిబంధనతో కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి. దీనిపై ఉన్నతస్థాయిలో ఇక్కడి పరిస్థితిని వివరించాం.
జిల్లాలో నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములే. కొత్తగా ఒక్కటి కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు. జాతీయ రహదారికి సేకరించిన 250ఎకరాలు మాత్రమే ఇటీవల ఆ జాబితాలో చేరాయి. గతంలో ఉన్న 10వేల ఎకరాల సీలింగ్, 3వేల ఎకరాల సాగునీటి, 3వేల ఎకరాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్లు, ఇతర నిర్మాణాలనే నిషేధిత జాబితాలో చేర్చాం. ఇప్పటి వరకు జిల్లాలో రెండే పొరబాటున నిషేధిత జాబితాలో చేరినట్లు గుర్తించాం. వాటిని పరిశీలించి తొలగించాం. ఎక్కడైన పట్టాభూములు నిషేధిత జాబితాలో చేరాయని తగిన రుజువు చూపిస్తే 48గంటల్లో తొలగిస్తాం. గతంలో కొన్ని చోట్ల పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు ఉచితంగా పొందితే అవి నిషేధిత జాబితాలోనే ఉంటాయి. ఎవరైనా రుసుం చెల్లించి రెగ్యులర్ చేసుకుంటే మాత్రం నిషేధిత జాబితాలో ఉండవు.
జిల్లాలో అధిక సంఖ్యలో ఓటర్ల వివరాలు పరిశీలించాల్సి ఉంది. ఓటర్లు నోటీసులకు త్వరగా స్పందిస్తే మరింత సులువవుతుంది. నిర్ణీత రోజుల్లో ఎన్నికల అధికారుల వద్ద హియరింగ్‌కు హాజరు కావాలి. ఏవైనా ఇబ్బందులు ఉంటే స్థానిక బీఎల్‌వోలు, స్థానిక అధికారుల నుంచి మరింత స్పష్టత తీసుకోవచ్చు. త్వరగా పరిశీలన పూర్తి చేసి అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా విడుదల చేసేలా కృషి చేస్తున్నాం.
ఓటర్లు స్పందించాలి
48గంటల్లో తొలగిస్తా


