నిషేధిత జాబితాలో ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

నిషేధిత జాబితాలో ఇళ్లు

Sep 3 2026 8:23 AM | Updated on Sep 3 2026 8:23 AM

● ప్రభుత్వ భూములుగా నమోదు ● ఆందోళనలో నగరవాసులు

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పట్టాభూములు 22ఏ నిషేధిత జాబితాలో చేరడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. మంచిర్యాల తహసీల్దార్‌ పరిధిలో ప్రభుత్వ భూములు 1,473 ఎకరాలు ఉండగా, అందులో రోడ్లు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, పాఠశాలలు, ఆసుపత్రులు, కాలేజీలు, పోస్టాఫీసు, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌, రైల్వే ట్రాక్‌కు సంబంధించినవి ఉన్నాయి. కొన్ని కాలనీల్లో ప్రభుత్వ భూమి కొంత ఉంటే దానిని ఆనుకుని పట్టా భూములూ ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నిషేధిత జాబితాలో పట్టా భూములనూ చేర్చడంతో ఇన్నాళ్లుగా ఆ భూమిలో నివాసం ఉంటున్న వారు ఉలిక్కిపడ్డారు. పట్టా, రిజిస్ట్రేషన్‌ తర్వాతే మున్సిపాలిటీ అనుమతితో ఇళ్లు నిర్మించి ఏళ్లుగా నివసిస్తుండగా ఇప్పుడు నిషేధిత జాబితాలో ఉందని ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

రెడ్డి కాలనీలోనే ఎక్కువ

నగరంలోని 48వ డివిజన్‌ రెడ్డికాలనీలో దాదాపు 500 ఇళ్లు నిషేధిత జాబితాలో వచ్చాయంటూ తహసీల్దార్‌కు కాలనీవాసులు వినతిపత్రాలు అందించారు. సర్వే నంబర్‌ 197, 423, 426లను పేర్కొంటూ ఇంటి నంబర్లతో సహా నిషేధిత జాబితా ప్రకటించారు. సర్వే నంబర్‌ 194లోని ఎక్కువ భాగం పట్టా కాగా, కొంత భాగమే ప్రభుత్వ భూమి ఉండగా, 195 సర్వే నంబరులో పూర్తి పట్టా భూములు ఉన్నా నిషేధిత జాబితాలో ఉన్నట్లు ప్రకటించారు. 194, 195 సర్వే నంబర్లలో పట్టా భూములను కొన్నేళ్ల క్రితమే రిజిస్ట్రేషన్‌ ద్వారా కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకుని ఏళ్లు గడుస్తున్నా నిషేధిత జాబితాలో చూపించడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోసారి సర్వే చేసి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. మిగతా డివిజన్లలోనూ నిషేధిత జాబితాలో పట్టా భూములు రావడంపై ప్రజలు తహశీల్దార్‌కు వినతిపత్రాలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement