శ్రీరాంపూర్: సింగరేణి ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ పోటీని తట్టుకుని నిలబడాలని సింగరేణి డైరెక్టర్(పీపీ) కొప్పుల వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం శ్రీరాంపూర్‌లోని ఎస్‌ఆర్‌పీ 1 గని ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవాలని, బొగ్గు ధర రోజురోజుకు తగ్గుతోందని, పోటీని తట్టుకోవడానికి నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకే అమ్మాల్సి ఉందని తెలిపారు. చెన్నూరు సౌత్, శ్రావణ్‌పల్లి, చింతగూడ గనుల తవ్వకానికి కృషి చేస్తున్నామని తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియా గత ఆర్థిక సంవత్సరం రూ.306 కోట్ల నష్టాలను చవిచూసిందన్నారు. గని ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పని చేసిన కార్మికులు వేడుకలకు హాజరయ్యారు. ఉద్యోగులు, అధికారులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ ఎం.వీరభద్రరావు, ఆర్జీ రీజియన్ క్వాలిటీ జీఎంలు వీరబధ్రరావు, వెంకటరమణ, రిటైర్డ్ సీజీఎం సుగుణా కర్‌రెడ్డి, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి షేక్‌బాజీ, ఐఎన్‌టీయూసీ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్‌రావు, అధికారుల సంఘం అపెక్స్ కౌన్సిల్ సీనియ ర్ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


