మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లాజిస్టిక్ సేవలను పూర్తిగా ప్రైవేటు సంస్థకు అప్పగించారు. టిక్కెటేతర ఆదాయంతో లాభాల పట్టిన ఆర్టీసీ కార్గోను ఆగస్టు ఒకటి నుంచి కట్టబెట్టారు. ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు 2020 జూన్ 19నుంచి కార్గో సేవలను ప్రారంభించింది. నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూనే టిక్కెటేతర ఆదాయం సమకూర్చుకుంది. లాభాలు వస్తున్న క్రమంలోనే యాజమాన్యం ఏం ఆలోచించిందో గానీ టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్‌ను మొదట ఏజెంట్ల పరం చేస్తూ వచ్చింది. మొదట ఒకట్రెండు అప్పగించినా ప్రధాన బస్‌స్టేషన్‌లు మినహాయిస్తే కమీషన్ బేసిక్‌పై ఏజెంట్లకు అప్పగిస్తూ వచ్చింది. ఆరేళ్ల తర్వాత సరుకు రవాణా సేవలను అందిస్తూ ఆదా యం గడిస్తున్న సంస్థ కార్గో సేవల నుంచి తప్పుకుని ప్రైవేటు పరం చేయడం చర్చనీయాంశమైంది.
ఏజెంట్లతో మొదలై..
మంచిర్యాల డిపో పరిధిలో మంచిర్యాల, చెన్నూర్, లక్సెట్టిపేట, జన్నారంలో పార్సిల్, కొరియర్ సర్వీస్ కేంద్రాలు ప్రారంభించారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌తోపాటు మంచిర్యాల బస్టాండ్‌లో 14మంది ఆర్టీసీ ఉద్యోగులను నియమించారు. జన్నారం, లక్సెట్టిపేట, చెన్నూర్‌లో ఆర్టీసీ ఉద్యోగులను నియమించగా లాజిస్టిక్(కార్గో) సరుకుల రవాణా, పర్యవేక్షణ వారి కనుసన్నల్లోనే నడిచేది. కాలక్రమంలో ఒకరిద్దరు ఆర్టీసీ ఉద్యోగులు ఉండగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో నడిపించారు. మంచిర్యాల బస్టాండ్‌లో కార్గోను ఒక్కరికే పరిమితి చేసి ట్రాన్స్‌పోర్టు చార్జీలపై 12శాతం కమీషన్‌తో ఏజెంట్లకు అప్పగించారు. మందమర్రి, జైపూర్, సీసీసీ కార్నర్‌లో ప్రైవేటు ఏజెంట్లకు అప్పగించారు. మహారాష్ట్రలోని నాందేడ్, ముంబయిలకు కార్గో, పార్సిల్ సేవలను విస్తరించారు. మంచిర్యాల బస్‌స్టేషన్ నుంచి రోజుకు రూ.30వేల నుంచి రూ.40వేల ఆదాయం సమకూరిందని తెలుస్తోంది. ఒక్కో రోజు రూ.48వేలు దాటిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లాజిస్టిక్ సేవలను ఏజెంట్ల నుంచి కార్గో సేవలను ప్రైవేటుకు అప్పగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఎన్నో సేవలు..
ఆర్టీసీ లాజిసి్‌ట్‌క్ ద్వారా అనేక పథకాలు చేపట్టారు. సీతారాముల కల్యాణ వేడుకల తలంబ్రాలు, మేడారం సమ్మక్క–సారలమ్మ బెల్లం ప్రసాదం, రాఖీల బట్వాడా ద్వారా సంస్థకు లాభాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి రైతుల పంట దిగుబడులను ఆయా గోదాములకు తరలించడం, ఎరువులు, విత్తనాల సరఫరా తదితర సరుకులను కార్గో ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించే సౌకర్యం కల్పించారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఏఎన్‌ఎల్ పార్సిల్ పేరిట నిర్వహణ సాగగా ఆకస్మాత్తుగా నిలిపివేశారు. 2019లో 52రోజులపాటు సమ్మె, కరోనాతో ఆర్టీసీ ఆదాయం పడిపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదాయ మార్గాల్లో భాగంగా ఆర్టీసీ సరుకు రవాణా సేవలను ప్రారంభించి లాభాల బాట పట్టించారు.
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు..
ఆర్టీసీలో ఖాళీల భర్తీకి రెగ్యులర్ ఉద్యోగులను నియమిస్తామని చెబుతున్న ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. బస్సులను రెగ్యులర్ డ్రైవర్లు(శాశ్వత) నడిపేవారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లు ప్రైవేటు వారు కాగా కండక్టర్లుగా ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే విధులు అప్పగిస్తూ వచ్చారు. ప్రస్తుతం అద్దె బస్సులు పెరిగిపోయాయి. మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రైవేటు కండక్టర్లు, డ్రైవర్లు ఇద్దరినీ తాత్కాలికంగానే నియమించారు. ఆదిలాబాద్ రీజియన్‌లో 74 మంది కండక్టర్లకు గాను 71 మంది, 185 మంది డ్రైవర్లు తాత్కాలిక ఉద్యోగులే. ఎప్పుడు విధులకు వస్తారో.. ఎప్పుడు మానేస్తారో తెలియకుండా పోతోంది. దీంతో ఆర్టీసీ రెగ్యులర్ ఉద్యోగులపై అదనపు భారం పడుతోంది. ససరైన శిక్షణ, ఉద్యోగ భద్రతలేని తాత్కాలిక సిబ్బంది వల్ల ప్రయాణికుల భద్రత, సేవల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.


