ఇచ్చిన హామీలన్నీ దాదాపు తీర్చాం
సింగరేణి పట్టాల పంపిణీ ఒక్కటే పెండింగ్
మంచిర్యాల ఎమ్మెల్యే
కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలటౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని, సింగరేణి పట్టాల పంపిణీ ఒక్కటే పెండింగ్‌లో ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. విద్య, వైద్యం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు
ఎమ్మెల్యే: ప్రతియేటా వర్షాకాలంలో మంచిర్యాలలోని రాళ్లవాగు బ్యాక్ వాటర్‌తో స్థానిక కాలనీలు వరద ముంపునకు గురవుతున్నాయి. రాళ్లవాగుకు కరకట్ట నిర్మాణం హామీతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఐబీ ఆవరణలో నిర్మించడం, దండేపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సింగరేణి స్థలాల పట్టాల పంపిణీకి హామీ ఇచ్చాను.
ఇప్పటి వరకు నెరవేర్చినవి..
ఎమ్మెల్యే: రాళ్లవాగు వరద ముంపు నుంచి కాపాడేందుకు రూ.255 కోట్లతో కరకట్ట పనులు చేపడుతున్నాం. రూ.300 కోట్లతో ఐబీ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. గెలిచిన 45 రోజుల్లోనే మంచిర్యాల, నస్పూరు, లక్సెట్టిపేట మున్సిపాలిటీల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చి హామీని నెరవేర్చాను.
ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు
చేపడుతున్నారు
ఎమ్మెల్యే: ప్రజలకు హామీ ఇవ్వకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు, పనులు చేపడుతున్నాం. లక్సెట్టిపేటలో ప్రభుత్వ పాఠశాల, కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి భవనం నిర్మాణం పూర్తి చేశాం. మంచిర్యాల మార్కెట్ రోడ్డులో రూ.78 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, రాష్ట్రంలోనే మొదటిసారి అండర్ గ్రౌండ్ విద్యుత్ కనెక్షన్, రోడ్ల వెడల్పు పనులను ప్రారంభించి సగానికి పైగా పూర్తి చేశాం. 102 రోజుల్లోనే రూ.10.22 కోట్లతో మహాప్రస్థానాన్ని పూర్తి ఆహ్లాదకరంగా, గ్రీనరీతో నిర్మించాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంటర్నేషనల్ ఫిష్‌పాండ్‌ను రూ.85 కోట్లతో 85 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నాం. 8 వేల మంది మత్స్యకారులు, రైతులకు ఉపాధి లభిస్తుంది. నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు..
ఎమ్మెల్యే: గోదావరి పుష్కరాల దృష్ట్యా మంచిర్యా ల, గూడెం గోదావరి నదీ తీరంలో పుష్కరఘాట్ల వద్ద వసతుల కల్పనకు రూ.24 కోట్లతో పనులు ప్రారంభించాం. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం పునర్నిర్మాణం రూ.100 కోట్లతో చేపట్టాం. మంచిర్యాలలోని విశ్వనాథ ఆలయం అభివృద్ధికి రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రూ.16.70కోట్ల రోడ్ల పనులు ప్రారంభించాం.
ప్రజలకు మీరిచ్చే భరోసా?
ఎమ్మెల్యే: ఈ ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం అందేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నాం. లక్సెట్టిపేట ప్రభుత్వ కాలేజీ, పాఠశాల నిర్మాణం రాష్ట్రంలోనే ఒక మోడల్‌గా నిలిచి, విద్యార్థుల చేరికల్లో నంబర్‌వన్‌గా నిలుస్తోంది. అన్ని ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు, విద్య ప్రతీ ఒక్కరికి ఉచితంగా, పూర్తి నాణ్యతతో ఇవ్వడమే ధ్యేయం. ప్రభుత్వ వైద్యం ప్రజలందరికీ నాణ్యతతో అందేందుకు ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతుండగా, అవి అందుబాటులోకి త్వరలోనే వచ్చి అన్ని రకాల వైద్య సేవలు మంచిర్యాలలోనే లభిస్తాయి. మంచిర్యాలను మెడికల్ హబ్‌గా మారుస్తాను.


