పంట ఉత్పత్తులు పెరిగినా నిల్వలకు కష్టాలు గత యాసంగిలో ధాన్యం సేకరణలో ఇబ్బందులు కొత్త గోదాముల నిర్మాణాలు ఇంకా ప్రతిపాదనల్లోనే ‘సైలోబ్యాగు’ పద్ధతి అమలైతే తీరనున్న అవస్థలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో ఏటేటా పెరుగుతున్న పంట ఉత్పత్తుల నిల్వలకు సరిపడా గోదాములు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ధాన్యం సేకరణ సమయంలో అధికార యంత్రాంగం అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాలో గత యాసంగిలో 1.97లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. సరిపడా మిల్లులకు ట్యాగింగ్ లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. జిల్లాలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల పరిధిలో మొత్తం 24గోదాములు 67820 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతోనే ఉన్నాయి. వీటిలోనూ బెల్లంపల్లి, మందమర్రి, భీమారం, చెన్నూర్, జన్నారంలో ఐదు వేల మెట్రిక్ టన్నుల చొప్పున కోటపల్లి, తాండూర్ మండలం రేచినీలో 2500 మెట్రిక్‌టన్నుల చొప్పున నిల్వ చేసే స్థితిలో మాత్రమే గోదాములు ఉన్నాయి. మిగతావన్నీ నిల్వలకు యోగ్యంగా లేవు. ఇవిగాక ఇన్వెస్టర్ గోదాంగా ఉన్న జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో 15వేల మెట్రిక్ టన్నులు నిల్వ చేయొచ్చు. మొత్తంగా 45వేల మెట్రిక్‌టన్నుల వరకే నిల్వ చేయవచ్చు. డీసీఎంఎస్ పరిధిలో వెంకట్రావుపేటలో మరో గోదాం ఉంది. ఇవి కాకుండా జిల్లాలో ఇతర గోదాములేవీ లేవు. దీంతో ప్రైవేటు గోదాములను ఆశ్రయించాల్సి వస్తోంది. పౌరసరఫరాల శాఖ పరిధిలో నెలవారీగా బియ్యం నిల్వలకు సైతం నస్పూర్‌లోని తీగల్‌పహాడ్ ప్రైవేటు గోదాంలో నిల్వ చేయాల్సి వస్తోంది.
సైలోబ్యాగ్ పద్ధతితో ఊరట
సైలోబ్యాగ్ పద్ధతిలో ఒక్కో నియోజకవర్గం పరిధి లో యాభై నుంచి వంద ఎకరాలు కేటాయించి గో దాంల కొరత తీరుస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలో ఏర్పాటైతే పంట ఉత్పత్తుల నిల్వలకు సమస్య తీరనుంది. సైలోబ్యాగ్ పద్ధతిలో మందమైన పాలీథిన్ కవరును నిర్ణీత, ఎత్తు, వెడల్పుతో భారీ స్థాయి బ్యాగు తరహాలో ఏర్పాటు చేస్తారు. ఈ పాలీథిన్ కవర్ సూక్ష్మ జీవులు రాకుండా, నీరు, తేమ చేరకుండా మందంగా ఉండడంతో తక్కువ స్థలం, ఖర్చుతో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు వీలుగా ఉంటుంది.
కొత్త గిడ్డంగులు అవసరం
జిల్లాలో ప్రధాన పంటలైన పత్తి, ధాన్యం, తర్వాత మొక్కజొన్నల నిల్వలకు సరిపడా గిడ్డంగులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పత్తి సీసీఐ కొనుగోళ్లతో మిల్లుల్లోనే నిల్వతో ఇబ్బందులు తలెత్తడం లేదు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సీఎంఆర్(కస్టం మిల్లింగ్ రైస్) అనుమతి లేక చివరకు బ్లాక్ లిస్టులో ఉన్న 14రైస్‌మిల్లుల్లోనూ ధాన్యం నిల్వ చేశారు. ఇవి కాకుండా పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు సైతం ధాన్యం పంపేందుకు అనుమతి తీసుకున్నారు. అయినా కొరత ఏర్పడడంతో కాసిపేటలో సింగరేణికి చెందిన ఆర్‌అండ్‌ఆర్ కమ్యూనిటీ హాల్, ఇల్లందు క్లబ్‌లోనూ ధాన్యం నిల్వ చేయాల్సి వచ్చింది. ఇంకా సరిపోకపోతే మహిళా సంఘ భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాలను నిల్వ కోసం పరిశీలించారు. జిల్లాలో పంటల ఉత్పత్తుల నిల్వ కొరత తీర్చేందుకు రాష్ట్ర గిడ్డంగుల శాఖ పరిధిలో లక్సెట్టిపేటలో 15వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం కోసం భూమి పూజ చేశారు. ఇంకా పనులు మొదలు కావాల్సి ఉంది. ఇవికాకుండా కొత్తగా జిల్లాలో జన్నారం, చెన్నూరు, బెల్లంపల్లి పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మూడు గోదాంలు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికీ ఆమోదం రాలేదు.
ప్రతిపాదనలు పంపాం
జిల్లాలో అవసరమైన చోట్ల నూతన గోదాంల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాము. ఉన్నత స్థాయి నుంచి ఆమోదం వస్తే కొత్త గోదాంల నిర్మాణాలకు ఆస్కారం ఉంటుంది.
–షంషోద్దీన్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి


