బెల్లంపల్లి: పురాతన బొగ్గు గనుల ప్రాంతం బెల్లంపల్లి మరో చారిత్రక ఘట్టానికి కేంద్ర బిందువుగా మారబోతోంది. సింగరేణిలో ప్రప్రథమంగా చేపట్టబోతున్న బొగ్గు గ్యాసిఫికేషన్ సర్వేలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్‌గా బెల్లంపల్లి డీప్‌సైడ్ బ్లాక్‌ను ఎంపిక చేస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సింగరేణి కాలరీస్ సీఎండీ డాక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి ప్రకటించి ఈ ప్రాంత ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో శనివారం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ డాక్టర్ నాగులపల్లి శ్రీకాంత్, సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఈడీ వెంకన్న, జనరల్ మేనేజర్లు టి.శ్రీనివాస్, జి.దేవేందర్, రాందాస్‌తో సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు. బొగ్గు గనులు మూతపడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లి మిణుకుమిణుకు మంటున్న బెల్లంపల్లి ఉనికి మరిన్ని కాలాలపాటు సజీవంగా ఉండేలా తీసుకున్న ఈ నిర్ణయంపై ఈ ప్రాంత ప్రజల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పైలట్ ప్రాజెక్ట్ సర్వేతో వచ్చే ఫలితాలపై ఆధారపడి బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలో అడుగుపెట్టే అవకాశాలు, సాధ్యాసాధ్యాలను సింగరేణి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు బ్లాక్‌లో 12 బిలియన్ క్యూబిక్ మీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం బ్లాక్‌లో రెండు బిలియన్ క్యూబిక్ మీటర్లు, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్ బ్లాక్‌లో ఐదు బిలియన్ క్యూబిక్ మీటర్ల మిథేన్ గ్యాస్ నిల్వలు గుర్తించారు.
ప్రతిపాదిత డీప్ సైడ్ బ్లాక్ ఇదే..
బెల్లంపల్లి డీప్‌సైడ్ బ్లాక్‌లో గ్యాసిఫికేషన్ అన్వేషణ నిర్వహిస్తామని సింగరేణి సీఎండీ ప్రకటించగా ప్రస్తుతం ఆ డీప్ సైడ్ బ్లాక్ ఎక్కడ ఉందనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి చేస్తున్న శాంతిఖని భూగర్భ గని వద్ద నుంచి 65 డీప్, సుభాష్‌నగర్, నెంబర్–2 ఇంక్లైన్ శివారు అట వీ ప్రాంతం నుంచి ఐటీడీఏ హార్టికల్చర్, మండల ప్రజాపరిషత్ కార్యాలయం, పోచమ్మ చెరువు, సంక్షేమ గురుకుల విద్యాలయాల పక్క నుంచి శివాల యం, శ్రీషిర్డీ సాయిబాబా దేవాలయం, బుధాగెస్ట్ హౌస్, కాసిరెడ్డిపల్లి, బుధాకుర్థు, కత్తెర్ల, తాండూర్ గ్రామాల శివారు మీదుగా రేపల్లెవాడ అటవీ ప్రాంతం వరకు గ్యాసిఫికేషన్ అన్వేషణ చేపట్టనున్నారు.
లోతైన బొగ్గు పొరలు అనుకూలం
మిథేన్ గ్యాస్ ఏర్పడటానికి అత్యంత లోతులో ఉన్న బొగ్గు పొరలు అనుకూలంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి డీప్‌సైడ్ బ్లాక్‌లో సుమారు 400మీటర్ల నుంచి 500మీటర్ల దిగువలో బొగ్గు నిక్షేపాలు భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నట్లు తెలుస్తోంది. మూడున్నర దశాబ్దాల క్రితం సింగరేణి జియాలజికల్ సర్వే అధికారులు ఈ ప్రాంతంలో సర్వే చేసి బొగ్గు పొరల లోతును అంచనా వేశారు. ప్రస్తుతం శాంతిఖని భూగర్భ గనిలో 450 మీటర్ల లోతు నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతుండటం గమనార్హం. అయితే, డీప్‌సైడ్ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి చేయడం కన్నా మిథేన్ గ్యాస్ వెలికి తీయడం అత్యంత సులువు అవుతుందనే ఉద్దేశంతో యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రెండు డ్రిల్‌లతో సర్వే
పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా డీప్‌సైడ్ బ్లాక్‌లో 50 మీ టర్ల దూరంలో రెండు బోర్లు వేసి వీటిని భూగర్భంలో నుంచి అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. ఆ ప్రకారంగా అనుసంధానమైన రంఽధ్రాల ద్వారా మిథేన్ గ్యాస్ మండే స్వభావం, నాణ్యతను పరిశీలించి గ్యాస్ లభ్యతను అంచనా వేస్తారు. ఆ పరీక్షలో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలో కాలు మోపాలా? వద్దా? అనేది సింగరేణి యాజమాన్యం తుది నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఉండనున్నాయి.
శక్తి వనరు ఇంధనంగా..
భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీని బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలో అడుగు పెట్టాలని కొంతకాలం నుంచి కోరుతూ వస్తోంది. ఇన్నేళ్లకు గాని సింగరేణి నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. బొగ్గుతో పోలిస్తే మిథేన్ గ్యాస్‌తో అత్యల్పంగా కాలు ష్యం వెలువడుతుంది. పర్యావరణానికి అంతగా విఘాతం కలగకపోగా శుభ్రమైన ఇంధనం కరెంట్ ఉత్పత్తికి, పరిశ్రమలకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగ పడుతుంది. గతంలో మిథేన్‌గ్యాస్ ప్రమాదకారిగా ప్రచా రం జరగగా ఇటీవలికాలంలో అత్యంత శక్తి వనరుగా, ప్రమాదరహిత గ్యాస్‌గా ప్రపంచదేశాలు వినియోగిస్తున్నాయి. భవిష్యత్ అవసరాలకు బొగ్గు వనరులు అంతరించిపోయే ప్రతికూల పరిస్థితుల్లో మిథేన్ గ్యాస్ వనరు ఆ లోటును పూడ్చి కంపెనీ ఆదాయ వృద్ధికి దోహదపడే అవకాశాలున్నాయి.


