ఓటుకు నోటు ఆశ | - | Sakshi
Sakshi News home page

ఓటుకు నోటు ఆశ

Feb 5 2026 7:42 AM | Updated on Feb 5 2026 7:42 AM

ఓటుకు

ఓటుకు నోటు ఆశ

జోరుగా ‘మున్సిపల్‌’ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

వీధుల్లో మైకుల మోత, ర్యాలీల హోరు

కార్యకర్తలకు తోడు ప్రచారంలో రోజువారీ కూలీలు

సోషల్‌ మీడియాలోనూ ప్రచార హోరు

మంచిర్యాలటౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీఫారాల అందజేత పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రత్యర్థులు ఎవరనేది స్పష్టమైంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఎం, ఆప్‌, సీపీఐ, ఏఐఎంఐఎం, ఏఐఎఫ్‌బీ, జేఎస్పీలకు ఆయా పార్టీల గుర్తులే ఉండడంతో ప్రచారం సులభంగా సాగుతోంది. స్వతంత్రులు తమకు కేటాయించిన గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు పొందేలా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 9న సాయంత్రం 5గంటల వరకే ప్రచారానికి గడువు ఉండడంతో రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికి తిరిగి ఓటర్లను పలుకరిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, రికార్డింగ్‌ పాటలు, వాయిస్‌లతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్య కూడళ్లు, జనసంచారం ఉన్న చోట్ల ప్రచారానికి వేదికగా మలుచుకుంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు అధికార పార్టీ వైఫల్యాలను ఓటర్ల ముందు ఎండగడుతున్నారు. కొత్త అభ్యర్థులు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, మాజీలు గతంలో చేసిన అభివృద్ధి పనులను చెబుతూ భవిష్యత్తులో చేసే పనులపై వివరిస్తున్నారు. ప్రచార సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అన్న, అక్క, వదిన, అమ్మ, తాత అంటూ ఆత్మీయతంగా పలుకరిస్తున్నారు. ఫొటోలు, గుర్తులతో కూడిన గోడప్రతులు, ఫ్లెక్సీలు ఇంటింటికి, జన సంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రదర్శించారు.

కూలీలతోనే ప్రచారం

అభ్యర్థులు ప్రచారానికి వెళ్లే ముందు రోజువారీగా మందీ మార్బలం కోసం ప్రత్యేకంగా కూలీలను నియమించుకుంటున్నారు. కార్యక్రమాన్ని బట్టి, కూలీల సంఖ్య ఆధారపడి ఉంటోంది. పార్టీకి చెందిన పెద్ద నాయకులు ప్రచారంలో పాల్గొంటే ఎక్కువ సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నారు. పార్టీ స్థాయిని బట్టి ఉదయం, సాయంత్రం ప్రచార ప్రాతిపదికన కూలి చెల్లిస్తున్నారు. ఉదయం ఒకసారి ప్రచారానికి రూ.300, రాత్రి వరకు ఉంటే రూ.500 చెల్లిస్తున్నారు. బైక్‌ ర్యాలీల్లో వెంట తిరిగే వారికి పెట్రోల్‌ ఖర్చులు భరిస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమ వెంట ప్రచారానికి వచ్చిన వారికి భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక కొన్ని పార్టీలు కార్యకర్తలకు సాయంత్రం మద్యం కూడా అందిస్తున్నాయి. రోజువారీగా ఖర్చు పెరిగినా గెలుపు కోసం లెక్క చేయడం లేదు.

పాటలతో హల్‌చల్‌...

అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేలా పాటలతో హల్‌చల్‌ చేస్తున్నారు. అభ్యర్థుల పేర్లు వచ్చేలా, తమ గుర్తుకే ఓటు వేయండంటూ రికార్డింగ్‌ చేసిన ఆడియోలతో వీధుల్లో మైక్‌లతో మోత మోగిస్తున్నారు. అభ్యర్థి వ్యక్తిత్వం, గెలిస్తే చేసే పనులు, పార్టీ చేసిన అభివృద్ధి, స్థానిక సమస్యలు ఉండేలా రికార్డింగ్‌ చేయించారు.

అదనంగా ‘సోషల్‌’ ప్రచారం

సోషల్‌ మీడియా వేదికగా ఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరం చేశారు. డివిజన్లు/వార్డుల పేరిట వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి ఓటర్ల ఫోన్‌నంబర్లు యాడ్‌ చేశారు. ఏరోజుకారోజు ఎన్నికల ప్రచార ఫొటోలు, వీడియోలు పంపిస్తున్నారు. ఎన్నికల హామీలు ప్రకటిస్తున్నారు.

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీలో పోటీ చేస్తున్న ఒకరిద్దరు అభ్యర్థులు ప్రచారానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యూహారచనలో నిమగ్నమయ్యారు. హంగు ఆర్భాటం లేకుండా ప్రత్యర్థుల ప్రచారపర్వాన్ని పరిశీలిస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. అర్థబలం కలిగిన ముగ్గురు అభ్యర్థులు ఓటుకు నోటు ఇచ్చి కొనుగోలు చేసి గెలవాలనే తలంపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రచారానికి వృథా ఖర్చు చేసే కన్నా పోలింగ్‌కు రెండ్రోజుల ముందు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే సరిపోతుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటుకు నోటు ఆశ 1
1/2

ఓటుకు నోటు ఆశ

ఓటుకు నోటు ఆశ 2
2/2

ఓటుకు నోటు ఆశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement