టీచర్ల హేతుబద్ధీకరణ
మంచిర్యాలఅర్బన్: పదేళ్ల తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది జూన్(కొత్త విద్యాసంవత్సరం) ప్రారంభం నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్) లెక్కల ఆధారంగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇదివరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు మిగులు, కొర త ఉపాధ్యాయుల వివరాలు విద్యాశాఖ సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. విద్యార్థుల సంఖ్య తగ్గడంతో అక్కడ టీచర్లు మిగులుగా ఉన్నట్లు తేల్చింది. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించింది. ఇందులో భాగంగా 357మంది మిగులు టీచర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. 96మంది ఉపాధ్యాయులు కొరత ఉన్నారని నివేదించినట్లు తెలు స్తోంది. హేతుబద్ధీకరణతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మెరుగుపడడంతోపాటు టీచర్ల కొరత తీరుతుందని ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది.
జిల్లాలో ఇలా..
పాఠశాలల హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్) ప్రక్రియలో చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. జీవో ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 19మంది విద్యార్థులు ఉంటే 1 టీచరు, 20 నుంచి 60మందికి ఇద్దరు, 61నుంచి 90మందికి ముగ్గురు, 91నుంచి 120మందికి నలుగురు, 121నుంచి 150మందికి ఐదుగురు, 151 నుంచి 200మంది వరకు ఉంటే ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్‌తోపాటు మరో ఐదుగురు ఎస్జీటీలు అవసరం ఉంటుంది. 201పైబడి ప్రతీ 40మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను నియమించాల్సి ఉంటుంది. యూపీఎస్‌లో 6, 7వ తరగతులకు 1నుంచి 100వరకు ఇద్దరు లాంగ్వేజ్, ఇద్దరు నాన్ లాంగ్వేజ్ టీచర్లు మొత్తం నలుగురు సబ్జెక్టు టీచర్లను నియమించాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో 220మంది వరకు ప్రధానోపాధ్యాయుడితోపాటు ఎనిమిది మంది, 221నుంచి 250వరకు హెడ్మాస్టర్‌తోపాటు ఎనిమిది మంది టీచర్లు(ఒక గణిత టీచర్ అదనం), 251 నుంచి 280 వరకు హెడ్మాస్టర్‌తోపాటు ఎనిమిది మంది టీచర్లు(గణితం, ఇంగ్లిషు టీచర్ అదనం), 281నుంచి 310వరకు హెడ్మాస్టర్‌తోపాటు ఎనిమిది మంది టీచర్లు(గణితం, ఇంగ్లిషు, తెలుగు టీచర్ అదనం), 311నుంచి 340వరకు ఫిజికల్ సైన్స్ అదనం, 341నుంచి 370వరకు సోషల్ టీచర్ అదనం, 371నుంచి 400 వరకు బయోసైన్స్ టీచర్ అదనంగా కేటాయించాల్సి ఉంటుంది. 401నుంచి 430 మంది విద్యార్థులుంటే మూడో గణిత ఉపాధ్యాయుడిని నియమించాలి. ప్రతీ 30 మంది విద్యార్థులకు అదే క్రమంలో ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఉన్నత పాఠశాలల్లో రెండు మాధ్యమాలు సమాంతరంగా నడుపుతున్నట్లయితే ఒక్క మాధ్యమానికి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే బోధన మాధ్యమానికి ఈ విధానం అమలు చేయాల్సి ఉంటుంది. అదనంగా నడుపుతున్న మరో మీడియం నాన్ లాంగ్వేజ్ అయిన గణితం, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ సోషల్ స్టడీ నలుగురు టీచర్లను కేటాయించాల్సి ఉంటుంది. 50 లేదా అంతకంటే ఎక్కువ విద్యార్థులున్నా పాఠశాలలకు మాత్రమే నలుగురు అదనపు టీచర్లను కేటాయిస్తారు.
మిగులు ఇలా..
జిల్లాలో 684 సర్కారు పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక 488, ప్రాథమికోన్నత 88, ఉన్నత పాఠశాలలు 101 ఉండగా 30,406 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 2,474 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులు తక్కువగా ఉండి ఎక్కువ ఉన్న ఉపాధ్యాయులు(మిగులు పాఠశాలలు) లెక్క తేల్చారు. జిల్లాలో 367 మంది మిగులు టీచర్లు(సర్‌ప్లస్ ఉన్నట్లు) తేల్చారు. ఇందులో చెన్నూర్, దండేపల్లి మండలాల్లో 43 మంది చొప్పున మిగులు ఉన్నట్లు గుర్తించారు. నెన్నెల 29, జైపూర్ 26, మంచిర్యాల 26, కోటపల్లి 25, తాండూర్ 24, హాజీపూర్ 22 మంది సర్‌ప్లస్ ఉపాధ్యాయులుండగా మిగిలిన మండలాల్లో 20లోపు నలుగురి నుంచి 20లోపు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించి హేతుబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేసింది.


