అభ్యర్థుల గుండెల్లో రె‘బెల్స్’!
బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ గుబులు పుట్టిస్తున్నారు. పార్టీ టికెట్ ఆశించి భంగపాటుకు గురైన వారు బరిలోనే ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. బెల్లంపల్లి మున్సిపాల్టీలో మాజీ కౌన్సిలర్లతోపాటు ముఖ్యమైన కార్యకర్తలు బరిలో ఉండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు సైతం రెబెల్స్ బెడద తప్పలేదు. ముఖ్యమైన నాయకులు పోటీలో లేకపోగా కొత్త అభ్యర్థులు ముఖ్యంగా మహిళలు బరిలో ఉండడంతో ఎన్నికల్లో ఎంతవరకు గట్టెక్కుతారోననే చర్చ జరుగుతోంది. 4, 8వ వార్డుల్లో ఎనిమిది మంది పోటీలో ఉండగా, 14వ వార్డులో ఏడుగురు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 13, 31వ వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడం గమనార్హం. బల్దియాలోని 34వార్డుల్లో 173మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా వీరిలో 66మంది స్వతంత్రులుగా తలపడుతున్నారు.
17వ వార్డులో కాంగ్రెస్, 18వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థులతో పోటీ పడుతున్నారు. 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థితో మాజీ కౌన్సిలర్ రెబెల్‌గా ఉండగా, 20, 22వ వార్డుల్లో కాంగ్రెస్, 25లో బీఆర్‌ఎస్‌కు, 26, 27, 28, 29వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు, 30వ వార్డులో కాంగ్రెస్‌కు మాజీ కౌన్సిలర్ కూతురు రెబెల్‌గా పోటీ చేస్తున్నారు. 33వ వార్డులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు రెబెల్‌ను ఎదుర్కొంటున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థికి పోటీగా మాజీ కౌన్సిలర్ రంగంలో ఉన్నారు. 34లో కాంగ్రెస్ అభ్యర్థికి రెబెల్ పోటీలో ఉన్నాడు. రెబెల్స్ అభ్యర్థులపై ఆయా పార్టీలు ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఎలాంటి ప్రభావం చూపబోరని ఊరుకున్నారా లేదా రెండు మూడు రోజుల్లో రంగంలోకి దిగి బుజ్జగిస్తారా తేలాల్సి ఉంది.


