ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు

Jan 10 2026 9:26 AM | Updated on Jan 10 2026 9:26 AM

ఆర్టీ

ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు

బస్సుల్లో 50శాతం చార్జీల పెంపు పట్నం నుంచి పల్లెబాట పట్టిన ప్రజలు ‘సంక్రాంతి’ సెలవులతో పెరిగిన రద్దీ ప్రయాణికులకు తప్పని అవస్థలు

టికెట్‌ చార్జీల పెంపు సరికాదు

సంక్రాంతి పండుగకు ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ చార్జీలు పెంచడం సరికాదు. ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించలేక.. రైళ్ల రాకపోకలు లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వస్తోంది. శుక్రవారం లగ్జరీ బస్సులో హైదరాబాద్‌ నుంచి మంచిర్యాలకు ఆన్‌లైన్‌ టికెట్‌ బుక్‌ చేశాను. ఇద్దరికి రూ.1520 చార్జీలయ్యాయి. ఈ లెక్కన సాధారణ రోజుల్లో టికెట్‌ ధర రూ.530 కాగా ఆన్‌లైన్‌ రూ.20 ఉండేది. మొత్తం కలిపినా రూ.1100 అయ్యేది. ఇలా ప్రయాణికులపై చార్జీల భారం పెంచకుండా తగ్గించాలి. ఆర్టీసీ పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి అవసరాలను ఆసరాగా చేసుకుని చార్జీలు పెంచేస్తున్నట్లుంది.

– రాజేశ్‌, మంచిర్యాల

పండుగ పూట

పెంపు ఎందుకు..!

సాధారణ రోజుల్లో ఆర్టీసీ చార్జీలు పెంచకుండా పండుగ పూట ఎందుకు పెంచుతుందో అర్థం కావడం లేదు. బస్సుల సంఖ్య పెంచకుండా స్పెషల్‌ బస్సుల పేరిట టికెట్‌ ధరలు అమాంతం 50శాతం పెంచడం సామాన్యులపై భారం వేయడమే. ఆర్టీసీ ఆదాయంపై ఉన్న దృష్టి సౌకర్యాల కల్పనపై లేకుండా పోతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఏ బస్సు చూసిన రద్దీగా ఉంటుంది. పండుగ వేళల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడంతోపాటు చార్జీలు తగ్గించాలి.

– ప్రవీణ్‌, మంచిర్యాల

మంచిర్యాలఅర్బన్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో చార్జీల పెంపుతో సంక్రాంతి కానుకగా బాదుడు మొదలైంది. పండుగ, సెలవుల నేపథ్యంలో పట్టణాల నుంచి జనం పల్లె బాట పట్టింది. విద్యాసంస్థలకు ఈ నెల 10 నుంచి 16వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో దూర ప్రాంతాల్లోని విద్యార్థులు, ఉద్యోగరీత్యా వెళ్లిన వారు శుక్రవారం స్వగ్రామాలకు బయల్దేరారు. ఆర్టీసీ బస్సులు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. మహిళల ఉచిత ప్రయాణంతో ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో మంచిర్యాలకు చేరుకుని అక్కడి నుంచి పల్లె ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మంచిర్యాల బస్టాండ్‌ ప్రయాణికులతో కోలాహలంగా మారింది.

హైదరాబాద్‌ నుంచి మంచిర్యాలకు..

మంచిర్యాల ఆర్టీసీ డిపో పరిధిలో 138 బస్సులు ఉండగా.. 38 హైదరాబాద్‌కు రెగ్యులర్‌గా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నెల 7నుంచి 14వరకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. పండుగ వేళ రద్దీ రోజులుగా పరిగణిస్తూ శుక్రవారం హైదరాబాద్‌ నుంచి మంచిర్యాలకు 24 ప్రత్యేక బస్సులు నడిపించగా.. 15బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం కల్పించారు. దీంతో బస్సులన్నీ నిండిపోయాయి. శనివారం 24 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. ఏ బస్సులో చూసినా సీట్లు లేవనే సమాధానంతో ప్రయాణికులు ఒకింత నిరాశకు గురి కావాల్సి వస్తోంది. రైళ్లలో బెర్తులు దొరక్కపోవడం, ఆర్టీసీ బస్సులు నిండిపోవడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

చార్జీల వడ్డింపు..

సంక్రాంతి పండుగతో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ఒకటిన్నర చార్జీ వసూలు చేస్తోంది. సాధారణ సమయాల్లో నడిచే బస్సుల్లో మాత్రం చార్జీల పెంపునకు మినహాయింపు ఇచ్చారు. హైదరాబాద్‌ జేబీఎస్‌ నుంచి మంచిర్యాలకు బస్సులు ప్రారంభమవుతా యి. జేబీఎస్‌ నుంచి రెగ్యులర్‌ బస్సుల్లో టికెట్‌ ధర రూ.530 కాగా.. ప్రత్యేక బస్సుల్లో రూ.740(ఒకటిన్నర చార్జీ)తో ప్రయాణికుల నుంచి వసూలు చేశా రు. ఆన్‌లైన్‌లో టికెట్‌ కొనుగోలు చేస్తే రూ.50 అదనంగా వడ్డించారు. ప్రత్యేక బస్సుల్లో చార్జీల వడ్డింపుపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికులకు తప్పని పాట్లు..

మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్‌, చెన్నూర్‌ వైపు వెళ్లే బస్‌ పాయింట్ల వద్ద ప్రయాణికులు గంటలకొద్దీ వేచిచూశారు. బస్సులు సమయానికి రాకపోవడంతో గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది. బస్సు వచ్చిందంటే చాలు చుట్టుముట్టడం ప్రయాణికుల వంతైంది. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి వచ్చిన విద్యార్థులు పలు ప్రాంతాలకు వెళ్లే రద్దీకి అనుగుణంగా సరిపడా బస్సుల్లేక పడరానిపాట్లు పడాల్సి వచ్చింది. డిపోలో ఉన్న బస్సులనే రద్దీకి అనుగుణంగా సర్దుబాటు చేయాల్సి రావడంతో ఇబ్బందులు తప్పలేదు.

ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు1
1/1

ఆర్టీసీ ‘ప్రత్యేక’ బాదుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement