చైనా మాంజాపై పోలీసుల పంజా
మంచిర్యాలక్రైం: సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా గాలిపటాలు ఎగురవేస్తూ పిల్ల లు, పెద్దలు సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గాలిపటాలు ఎగురవేసేందుకు చాలామంది ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా వినియోగిస్తుండడం వల్ల ప్రజలు, పక్షలు గాయపడిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో చైనా మాంజా విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 6న ‘వామ్మో.. చైనా మాంజా’, 8న ‘సరదా.. కారాదు విషాదం’ శీర్షికన వరుస కథనాలు రావడంతో రామగుండం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పందించారు. జిల్లా వ్యాప్తంగా గాలిపటాలు విక్రయించే దుకాణాలపై అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో పకడ్బందీగా తనిఖీల నిర్వహణకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం జిల్లా పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి గాలిపటాలు, దారాలు విక్రయించే దుకాణాలు, గోదాముల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించిందని, ఎవరైన విక్రయించినా, వినియోగించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చైనా మాంజాతో పక్షులు, ద్విచక్ర వాహనదారులకు ప్రాణాపాయంగా మారుతుందని తెలిపారు. పిల్లలు ఏ దారంతో గాలిపటాలు ఎగురవేస్తున్నారని గమనించాలని తల్లిదండ్రులకు సూచించారు. చైనా మాంజా విక్రయాలపై పోలీసులకు గానీ, డయల్ 100కు గాని సమాచారం అందించాలని కోరారు.
చైనా మాంజాపై పోలీసుల పంజా


