మొక్కల పెంపకానికి కసరత్తు
దండేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మూడో వన మహోత్సవం 2025–26 సంవత్సరానికి గాను జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీల్లో మొక్కల పెంపకానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. పల్లె ప్రకృతి వనాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలు, ఇంటింటా మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తోంది. లక్ష్యం చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది 20,50,200 మొక్కలు పెంచాలనే లక్ష్యం మేరకు జిల్లా వ్యాప్తంగా నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు మొదలయ్యాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. పూలమొక్కల్లో మల్లె, గులాబీ, పండ్లమొక్కల్లో నిమ్మ, దానిమ్మ, జామ, మామిడి, చింత, నీడనిచ్చే మొక్కల్లో కానుగ, వేపతోపాటు 15నుంచి 20 జాతుల మొక్కలు పెంచనున్నారు. ప్రస్తుతం కవర్లలో మట్టినింపే పనులు జరుగుతున్నాయి.


