మైదానం ఉన్నా లేనట్లే!
లక్సెట్టిపేట: 1968లో లక్సెట్టిపేట తాలుకా హెడ్‌క్వార్టర్ ఉన్నప్పుడు ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేశారు. 1971లో కళాశాలగా అప్‌గ్రేడ్ చేశారు. జన్నారం, ధర్మపురి, ధర్మారం, హాజీపూర్ లాంటి సుదూర ప్రాంతాల విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. పట్టణానికి చెందిన దాత అప్పటి రోజుల్లో కళాశాలతోపాటు మైదానానికి మొత్తం సుమారు 9 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చినట్లు పూర్వీకులు తెలుపుతున్నారు. ఇక్కడే చదువుకున్న ప్రస్తుత, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు.. కళాశాలపై ఉన్న మమకారంతో ఇటీవల నూతన పక్కా భవానాన్ని నిర్మాణం చేపట్టారు. కళాశాల పక్కన ఉన్న మైదానాన్ని గత పాలకుల హయాంలో 2019లో మినీ స్టేడియం పనులు అర్థంతరంగా నిలిపివేశారు. గత ఆరేళ్లుగా అదే పరిస్థితి. అది కాక మైదానంలోనే ఓపెన్ జిమ్ ఏర్పాటుతో స్టేడియం విస్తీర్ణం తగ్గింది. స్టోర్ రూం నిర్మాణం నిరుపయోగంగా మారింది. మినీ స్టేడియానికి మంజూరైన నిధులు వృథా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని మైదానంపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
మైదానం కొలిక్కి వచ్చేదెలా..
గతంలో క్రీడాపోటీలు, టొర్నమెంట్లు జరిగేవి. వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, కబడ్డీ కోర్టులు హైజంప్, లాంగ్‌జంప్ అన్ని సౌకర్యాలు మైదానంలో ఉండేవి. మినీ స్టేడియం నిర్మాణ సమయంలో వాటిని తొలగించారు. విశాలంగా ఉన్న మైదానం నిర్మాణంతో విస్తీర్ణం తగ్గిపోయింది. ఉదయం వాకింగ్, సాయంత్రం సరదాగా మైదానంలో కాలక్షేపం చేసే స్థానికులు రాలేకపోతున్నారు. భవిష్యత్ ప్రణాళిక లేక నిర్మాణం చేశారని సంబంధిత అధికారులు మినీ స్టేడియం నిర్మిస్తారా లేక ఉన్న వాటిని తొలగించి విశాలంగా చేస్తారా అని మండిపడుతున్నారు.


