మామిడి పూత యాజమాన్య పద్ధతులు
చెన్నూర్‌రూరల్: ప్రస్తుతం మామిడి పూత ప్రారంభమైంది. వాతావరణ మార్పులతో ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి. జిల్లాలో రైతులు ఎక్కువగా మామిడి సాగు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన పూత కూడా రాలిపోయే అవకాశం ఉంది. దీంతో కాత కూడా తగ్గిపోతుంది. తద్వారా దిగుబడి తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మామిడి దిగుబడి పెంచాలంటే పూత, పిందె సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్‌వో కళ్యాణి పేర్కొన్నారు. వాతావరణ ప్రభావాన్ని అధిగమించాలంటే రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను అవలంబించాలని సూచించారు.
యాజమాన్య పద్ధతులు..
జూన్, జూలైలో మామిడి కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. ముఖ్యంగా ఎండు పుల్లలను మొత్తం తీసివేసి చెట్టును శుభ్రపర్చాలి. ఆగస్టులో చిలేటెడ్ జింక్ ఒక గ్రాము, ఒక లీటరు నీటికి లేదా, బోరాన్ (19 శాతం) 1.25 గ్రాములు, లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అక్టోబర్ నెలాఖరు, నవంబర్ తొలివారం నుంచి మామిడి చెట్టుకు నీరు కట్టడం ఆపి చెట్లను నీటి ఎద్దడికి గురిచేయాలి. నవంబర్‌లో 10 గ్రాముల పోటాషియం నైట్రేట్ (13–0–45) లీటరు నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా పూత మొగ్గలు సకాలంలో పూస్తాయి. పూత మొగ్గ పెరుగుదల దశలో (జనవరి 15 నుంచి) తేలికపాటి నీటితడులు ఇవ్వడం ద్వారా త్వరగా పూత విచ్చుకుని ఫలదీకరణ చెందుతుంది. పదేళ్ల పైబడిన చెట్లకు నాలుగు డ్రిపర్లు చెట్టు కాండం నుంచి మీటరు దూరంలో ఉండేటట్లు చూడాలి. ఒక చెట్టుకు 60 నుంచి 80 లీటర్లు నీరు అందేటట్లు (రోజుకు 2 గంటలు) ఇవ్వాలి. సూక్ష్మధాతు లోపం ఉన్న తోటల్లో 1.25 గ్రాముల బోరాస్ (19 శాతం) లీటరు నీటికి (125 గ్రాములు, 100 లీ.నీటికి) కలిపి మొగ్గల పెరుగుదల దశలో పిచికారి చేయాలి. తద్వారా ఫలదీకరణ జరిగి పిందె బాగా కట్టి అధిక దిగుబడి వస్తుంది. మామిడి పిందె దశలో (జొన్నగింజ పరిమాణం) ఉన్నప్పుడు నాప్తిలిన్ అసిటిక్ అమ్లం (ఎన్‌ఎఎ) 20 పి.పిఎం (2 గ్రాములు 100 లీటరు నీటికి) గాఢతలో రెండుసార్లు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. తద్వారా పూత, పిందె బాగా నిలబడుతుంది. కాయలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు పోటాషియం నైట్రేట్‌ను 10 గ్రాముల చొప్పున ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. దీంతో కాయ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని త్వరగా పెరుగుతుంది. ప్రస్తుతం మామిడిపూత దశలో ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.


