రాష్ట్రంలోనే మొదటిస్థానంలో 102 సేవలు
మంచిర్యాలటౌన్: రాష్ట్రవ్యాప్తంగా గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో సేవలు అందించడంలో 102 అమ్మఒడి వాహనం ప్రథమస్థానంలో నిలిచింది. గర్భిణులను మూడు నెలల నుంచి ప్రసవం అయ్యే వరకు ప్రభుత్వ ఆసుపత్రికి నెలవారీ వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లడంలో అందిస్తున్న సేవలకు మొదటిస్థానం పొందింది. ప్రసవం అనంతరం బాలింతలను ఇంటికి చేర్చడంలో, పసిపిల్లలకు షెడ్యూల్ ప్రకారం వాక్సినేషన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు, ఇంటికి చేర్చడంలోనూ సేవలు అందిస్తోంది. అక్టోబర్‌లో 3,250, నవంబర్‌లో 3,102, డిసెంబర్‌లో 3,509 కేసులకు 102 అమ్మ ఒడి వాహనం సేవలు అందించింది.
రెండోస్థానంలో 108
జిల్లాలో 108 వాహనాలు 18 ఉండగా 45 మంది పైలట్లు, 44 మంది ఈఎంటీలు పని చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లడంలో జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. అక్టోబర్‌లో 2,690, నవంబర్‌లో 2,910, డిసెంబర్‌లో 3,246 మందిని సంఘటన స్థలం నుంచి దగ్గరలోని ఆసుపత్రికి చేర్చింది. మెరుగైన వైద్యసేవలు అందిస్తూ ప్రాణహాని కలుగకుండా చూసింది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం
జిల్లాలో 102 అమ్మ ఒడి వాహనాల సేవలు, 108 అత్యవసర సేవలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలతోపాటు వైద్య సేవలను అందించడంలో సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారు. అందువల్లనే రాష్ట్రస్థాయిలో మొదటి, రెండవ స్థానాల్లో ఉండగలిగాం. ప్రజలు అత్యవసర సమయాల్లో సేవలను వినియోగించుకోవాలి.
– కొండలరావు, 108, 102
వాహనాల జిల్లా అధికారి


