అర్హులందరికీ సంక్షేమ పథకాలు
● పకడ్బందీగా ధాన్యం సేకరణ ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే..
వంద శాతం ఉత్తీర్ణతకు చర్యలు
జిల్లాలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. సంక్షేమ వసతిగృహాలు, విద్యాలయాలు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నాణ్యతను పరిశీలిస్తూ ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులకు సూచనలు చేస్తున్నాం. లక్సెట్టిపేట పాఠశాల, జూనియర్ కళాశాలను ఆధునిక హంగులతో నిర్మించాం. ఇందులో 400మంది చేరగా.. ఈ విద్యాసంవత్సరం వెయ్యి మంది అభ్యసించేలా సీట్లు కల్పించనున్నాం. ప్రతీ మండలానికి కేజీబీవీ పక్కా భవనాల నిర్మాణాలు చేపట్టడంతోపాటు మెరుగైన ఫలితాల సాధనకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. మూడు నియోజకవర్గాల్లో రూ.200 కోట్లలో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించడం జరుగుతుంది.


