విద్యార్థులు సృజనాత్మకత పెంచుకోవాలి
బెల్లంపల్లి: విద్యార్థులు సృజనాత్మకతను పెంచుకుని భవిష్యత్‌లో ఉన్నతంగా రాణించడానికి సంసిద్ధులు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. బుధవారం బెల్లంపల్లి బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ‘వేస్ట్ టు వెల్త్’ కార్యక్రమం నిర్వహించారు. 38 ఉన్నత పాఠశాలల విద్యార్థులు పనికి రాని వస్తువుల నుంచి 50 రకాల పైబడి గృహ, అలంకరణ వస్తువులు తయారు చేసి ప్రదర్శించారు. కళాత్మకంగా తయారు చేసిన వస్తువులు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాసిపేట మండలం దేవాపూర్ డీఏవీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో, బెల్లంపల్లి బజారు ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ, కాసిపేట మండలం ముత్యంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానం దక్కించుకున్నారు. విద్యార్థులను అభినందించి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, డీసీబీ సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి, ఎంఈవో జాడి పోచయ్య, రాష్ట్ర ఎన్‌జీసీ కోఆర్డినేటర్ విద్యాసాగర్ పాల్గొన్నారు.


