‘జలశక్తి అవార్డు’పై తప్పుడు ప్రచారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర జల్ శక్తి అభియాన్–క్యాచ్ ద రెయిన్‌లో భాగంగా గత నవంబర్‌లో జాతీయ స్థాయిలో ‘జల్ సంచాయ్ జన్ భాగిధారి’ మంచిర్యాల జిల్లా రూ.2కోట్ల అవార్డు గెలుచుకున్నది తెలిసిందే. అయితే క్యాచ్ ద రెయిన్(సీటీఆర్) పోర్టల్‌లో పని ప్రదేశానికి బదులు ఏఐ జనరేటెడ్‌తో ఉన్న జాతీయ జెండాను పోర్టల్ అప్‌లోడ్ చేసి అవార్డు పొందారంటూ ఓ హిందీ యూ ట్యూబ్ చానల్‌లో ప్రసారమైంది. మంచిర్యాల జిల్లాతోపాటు మధ్యప్రదేశ్ కాండ్వా జిల్లాలోనూ పెళ్లి పత్రికను అప్‌లోడ్ చేసి, క్షేత్రస్థాయిలో పని జరగకున్నా, తప్పుడు ఫొటోలు నమోదు చేసినా అధికారులు గుర్తించకుండా అవార్డులు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఏఐ ఫొటో అప్‌లోడ్ చేసిన మందమర్రి మండలం పొన్నారం ఇంకుడు గుంతలను బుధవారం నేరుగా వెళ్లి పరిశీలించారు. పని ప్రదేశంలో నీటిగుంతలు ఉన్నాయి. సీటీఆర్ పోర్టల్‌లో ఎవరైనా ఫొటోలు అప్‌లోడ్ చేయొచ్చని, వాటికి అవార్డులకు సంబంధం లేదని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అలాగే ఏఐ ఫొటోను తొలగించామని, ఆ ఫొటో అప్‌లోడ్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు సోషల్ మీడియాలో జరిగిన ప్ర చారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) వి వరణ ఇస్తూ నీటి సంరక్షణ పనుల పరిశీలన, అవార్డుల ఎంపిక పలు దశల్లో జరుగుతుందని, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అవాస్తవమని ఓ ప్రకటన విడుదల చేసింది.


