గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు | - | Sakshi
Sakshi News home page

గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు

Dec 30 2025 8:39 AM | Updated on Dec 30 2025 8:39 AM

గిరిజ

గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు

ఉమ్మడి జిల్లాలో 120 కేంద్రాలు ఆదివాసీ గిరిజనుల సమస్యలకు ఇక్కడే పరిష్కారం రేపు ఉమ్మడి జిల్లా 39వ వార్షికోత్సవం హాజరుకానున్న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ కలెక్టర్‌లు, ఎస్పీలు

1981లో అధికారిక గుర్తింపు

పెద్దలు చెప్పే తీర్పుకు చట్టబద్ధత

రాజ్‌గోండ్‌ సేవాసమితిలో అంతర్భాగం

ప్రాతినిధ్యం వహిస్తున్న 6 గిరిజన తెగలు

ఏటా డిసెంబర్‌ 31న ఉట్నూర్‌లోని గుస్సాడి గుట్టలో వార్షికోత్సవం.

మొదటి జిల్లా మేడి నార్నూర్‌ మండలం గాదిగూడ సర్పంచ్‌ ఆత్రం భీంరావ్‌

బజార్‌హత్నూర్‌: స్వాతంత్య్రానికి పూర్వమే రాయిసెంటర్ల ఆవిర్భావం జరిగినా మూడు దశాబ్దాల క్రితం ప్రాచూర్యం పొందాయి. నిరక్షరాస్యత, అమాయకత్వం రాజ్యమేలుతున్న వెనుకబడ్డ గిరిజన జాతుల్లో ఇప్పటికీ రాయిసెంటర్‌లే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. నవీన న్యాయానికి ఏమాత్రం తీసిపోకుండా ఉచిత న్యాయ తీర్పులు చెప్తూ ఆధునిక నాగరికతల్లోనూ వేళ్లూనుకున్నాయి. గిరిజనుల మధ్య తగాదాలకు, వివాదాలకు పరిష్కార మార్గాలకు దారిచూపుతున్నాయి. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య గొడవలే పోలీస్‌స్టేషన్‌లకు, కోర్టులకు వస్తుంటాయి. కానీ గిరిజన జాతుల మధ్య కేసులు మాత్రం ఆధునిక కోర్టుల వరకు వెళ్లవు. రాయిసెంటర్లలో గిరిజన పెద్దలు చెప్పే తీర్పులతోనే కేసులు సమసిపోతాయి. అందుకే నేటికీ గిరిజన సమాజంలో వీటికి ప్రత్యేకమైన విలువ ఉంది.

ఆ పేరు ఎలా వచ్చిందంటే?

గోండిభాషలో రాయి అంటే సలహా, నిర్ణయం, న్యాయం అనే అర్థాలు ఉన్నాయి. సెంటర్‌ అనగా కేంద్రం. ప్రారంభంలో సలహా కేంద్రాలుగా ప్రాచూర్యం పొందిన గిరిజన పంచాయతీలు క్రమేణ నిర్ణయ కేంద్రాలుగా మారాయి. కాలగమనంలో అవి గిరిజనుల న్యాయకేంద్రాలుగా రూపందుకున్నాయి. గోండురాజుల ఏలుబడిలో ఎవరికై నా ఎదైన సమస్య వచ్చినప్పుడు పెద్దల సలహా(రాయి) తీసుకునేవారు. సామాజిక సమస్యలు పరిష్కరించుకోడానికి గ్రామంలోని పెద్దలంతా ఒకచోట గుమిగూడి నిర్ణయానికి వచ్చేవారు. ఇప్పుడూ పద్ధతి ఏదైనా ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత సమస్య వస్తే పెద్దలు సమావేశమై న్యాయం చెబుతారు. అవే నేడు రాయిసెంటర్లుగా మారాయి.

స్వరూపం...

20 నుంచి 40 గిరిజన గ్రామాల పరిధిలో ఒక రాయిసెంటర్‌ ఉంటుంది. ఆయా గ్రామాల్లోని పటేల్‌, దేవరి, మహాజన్‌, గట్యాల్‌ (గిరిజన జాతుల పెద్దలు) కలిసి 11 మంది కార్యవర్గంతో రాయిసెంటర్‌ ఏర్పడుతుంది. రాయిసెంటర్‌ పెద్దను సార్‌మేడి (అధ్యక్షుడు), ఉపమేడి(ఉపాధ్యక్షుడు), గీతాదార్‌ (కార్యదర్శి), ఖజాన్‌దార్‌(కోశాధికారి), అవాల్‌దార్‌ (సమాచారం), మిగతావారు సలహాదారులు గా ఉంటారు. ఉమ్మడి జిల్లాలో 120 రాయి సెంట ర్లు ఉన్నాయి. వీటన్నింటిపై జిల్లాస్థాయిలో ఉట్నూర్‌లోని గుస్సాడిగుట్టలో జిల్లా రాయిసెంటర్‌ ఉంది. అక్కడి పెద్దను జిల్లా మేడి అని సంభోదిస్తారు. నెలకోసారి సమావేశాలు నిర్వహిస్తారు. కుటుంబ, ఆ స్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గిరి జనులకు సంబంధించిన అనేక సమస్యలను గ్రామ పటేల్‌ పరిష్కరిస్తాడు. అతనితో కానిపక్షంలో ఆ కేసుల ను రాయిసెంటర్‌ కు బదిలీ చేస్తాడు. ఇక్కడా పరిష్కారం కాకుంటే డివిజన్‌ సెంటర్‌కు బదిలీ చేస్తారు. అక్కడా పరిష్కారం కాకుంటే జిల్లాస్థాయిలో ఉట్నూర్‌ గుస్సాడిగుట్ట రాయిసెంటర్‌కు బదిలీ చేస్తారు. అక్కడ మూడుసార్లు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. కాని పక్షంలో జిల్లా ఎస్పీ, ఐటీడీఏ పీవోలను పిలిపించుకుని వారి సమక్షంలో సమస్య పరిష్కారం చేస్తారు.

సద్గుణాలే సార్‌మేడిల ఎంపికకు అర్హతలు

రాయిసెంటర్‌లో సా ర్‌మేడిగా ఎంపిక కా వడానికి ఎలాంటి ఉన్నత విద్య అవసరం లేదు. డ బ్బు, దర్పం పనికిరావు. సత్ప్రవర్త న, సేవాభావం, స ద్గుణాలే గిరిజన పెద్దగా ఎంపిక కావడానికి అర్హతలు. మత్తు పానీ యాలు సేవించకుండా ఉండటం. పొగ, చెడు అలవాట్లు లేకపోవడం వంటి గుణాలే సార్‌మేడి, జిల్లా మేడిలలో ఉంటాయి. ఎంపికై న తర్వాత వ్యసనాలకు అలవాటు పడితే తొలగించే అవకాశం ఉంది.

సెంటర్ల బలోపేతానికి మడావి తుకారాం కృషి

బ్రిటిష్‌ రీసెర్చర్‌ హైమన్‌డార్ప్‌ సూచనతో 1943 నిజాం పాలనలో రాయిసెంటర్లను మొదట ప్రారంభించారు. రాజ్‌గోండ్‌ సేవాసంస్థ గిరిజన సంప్రదాయంలో అంతర్భాగమై ఉన్న సెంటర్లను వెలుగులోకి తెచ్చిన ఘనత మొదటి గిరిజన ఐఏఎస్‌ మడావి తుకారాంకు దక్కుతుంది. ఉట్నూర్‌ మండలం లక్సెట్టిపేట వాసి అయిన మడావి తుకారాం హైమన్‌డార్ప్‌ వద్ద గోండిభాష అనువాదకుడిగా పనిచేశారు. హైమన్‌డార్ప్‌ సూచనల మేరకు గిరిజన సంప్రదాయాలను బలోపేతం చేశారు. గిరిజన వ్యవహారాల్లో కీలకమైన షోడావాజన్‌ (16 రకాల వాయిద్యాలు), అట్రడెమ్సంగ్‌ (18 రకాల నృత్యాలు)ను పటిష్టం చేయడానికి తీవ్ర కృషి చేశారు. అందులో భాగంగానే రాయిసెంటర్లకు చట్టబద్ధత కల్పించారు. వీటి పరిధిలో ధాన్యాగారాలను (గ్రెయిన్‌ బ్యాంకులు) ఏర్పాటు చేసి గిరిజనులు ధాన్యం నిల్వ చేసుకుంటే ఐటీడీఏ ద్వారా వాటికి సమాన ధాన్యాన్ని సబ్సిడీపై అందజేశారు. పొదుపు సంఘాలను ప్రోత్సహించారు.

ప్రొఫైల్‌

పంచాయతీలకే పరిమితం కాదు

రాయిసెంటర్లు కేవలం పంచాయతీలు, న్యాయం చెప్పడానికే పరిమితం కాలేదు. అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాయి. గిరిజనుల వ్యవహారాల్లో సంస్కరణలకు బాటలు వేస్తున్నాయి. సామూహిక వివాహాలను ప్రోత్సహించి అనవసర ఆర్థిక వ్యయాన్ని తగ్గిస్తున్నాయి. 2001లో ఇచ్చోడలో జరిగిన 106 గిరిజన పెళ్ళిళ్లలో రాయిసెంటర్‌ పాత్ర కీలకం. గిరిజనుల పెళ్లి సమయంలో వరుని కుటుంబం వధువు కుటుంబానికి ఆవు, మేక ఇచ్చే ఆచారాలను దూరం చేశారు. 1980–90 దశకంలో దేవ్‌దాన్‌ గోదాం(గ్రెయిన్‌ బ్యాంక్‌)లను ఏర్పాటు చేసి ధాన్యాలను రాయిసెంటర్ల ఆధ్వర్యంలో నిల్వ ఉంచే వారు. అగ్ని ప్రమాదాల్లో గిరిజన గూడేలు కాలిపోయినపుడు, కరువు పరిస్థితులు ఏర్పడినపుడు నిల్వ ధాన్యాన్ని పంచేవారు.

ఆదివాసీల ఆందోళనకు సామరస్యంగా పరిష్కారం

లంబాడీల వల్లే ఆదివాసీ గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని, వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ 2017 డిసెంబర్‌ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నెల రోజులపాటు ఇంటర్‌నెట్‌ సేవలను బంద్‌ చేశారు. శాంతి భద్రతలు చేయిదాటే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌, పోలీస్‌ అధికారులను బదిలీ చేశారు. ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా దివ్యదేవరాజన్‌ వచ్చారు. ఆదివాసీల ఆందోళనకు గల కారణాలను పరిశీలించి ఆదివాసీ గిరిజన పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు రాయిసెంటర్‌లను వినియోగించుకున్నారు.

న్యాయం జరుగుతుందని నమ్మకం

ఎంతపెద్ద సమస్య ఉన్నా గిరిజనులు పోలీస్‌స్టేషన్‌, కోర్టు గడప తొక్కరు. ఆర్థిక, సామాజిక గొడవలను గ్రామ పటేల్‌ సమక్షంలోనే పరిష్కారం అవుతాయి. బలమైన సమస్య, గ్రామాల మధ్య గొడవలు రాయిసెంటర్‌లో పరిష్కారం చేసుకుంటారు. ఇక్కడే తమకు న్యాయం జరుగుతుందని గిరిజనులు నమ్ముతారు.

– మెస్రం దుర్గు, జిల్లా మేడి

గౌరవిస్తాం

రాయిసెంటర్‌ల తీర్పులను గౌరవిస్తాం. కొంతమంది ఆదివాసీలు ఉన్నత ఉద్యోగాల్లోనూ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా ఉన్నా రాయిసెంటర్‌ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోం. రాయిసెంటర్‌లను, సార్‌మేడిలను, జిల్లా మేడిని గౌరవిస్తాం. మా పూర్వీకులు అందించిన సంప్రదాయాలను కాపాడుకుంటున్నాం.

– నగేశ్‌, ఎంపీ, ఆదిలాబాద్‌

ఏటా వార్షికోత్సవం

1943 నుంచి కొనసాగుతున్న రాయిసెంటర్లు నేటికీ గోండుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పనిచేస్తున్నాయి. సెంటర్లను 1987లో పునరుద్ధరించినప్పటి నుంచి ఉట్నూర్‌ కేంద్రంగా స్థానికంగా ఉన్న గోండు రాజుల పురాతన కోటలో జిల్లాలోని సార్‌మేడిల ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్‌ 31న వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. – తొడసం

దేవరావ్‌, ప్రధాన కార్యదర్శి, జిల్లా రాయిసెంటర్‌

గిరిజనుల న్యాయస్థానం

భారత న్యాయ వ్యవస్థలో కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఉన్న విదివిధానాలే గ్రామ స్థాయి రాయిసెంటర్‌ నుంచి జిల్లా రాయిసెంటర్‌ వరకు ఉంటాయి. గిరిజనుల సమస్య గ్రామ పటేల్‌ స్థాయిలో పరిష్కారం కాకుంటే జిల్లాస్థాయి రాయిసెంటర్‌కు వెళ్తారు. అనేక సమస్యలు ఇక్కడే పరిష్కరిస్తారు.

– డాక్టర్‌ తొడసం చందు,

జిల్లా రాయిసెంటర్‌ సలహాదారు

గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు1
1/4

గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు

గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు2
2/4

గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు

గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు3
3/4

గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు

గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు4
4/4

గిరిజన కోర్టులు..రాయిసెంటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement