ఎంతుందో..ఏముందో?
కడెం: సాగునీటి ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికతీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడెం ప్రాజెక్ట్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ఇందులో పేరుకుపోయిన పూడిక తీసేందుకు ఇటీవలే పనులు ప్రారంభించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 7.603 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటిమట్టం 4.699 టీఎంసీలుగా ఇరిగేషన్ అధికారుల అంచనా. అంటే 2.904 టీఎంసీల మేర పూడిక పేరుకుపోయినట్లు అంచనా. ప్రాజెక్ట్‌లో పూడిక ఎంతుందో తెలుసుకునేందుకు 2013లో సైతం హైడ్రాలజీ సర్వే నిర్వహించారు.
సిబ్బంది సర్వే
కడెం ప్రాజెక్ట్‌లో పూడికతీత పనులు దక్కించుకున్న రాజస్థాన్‌కు చెందిన కాంట్రాక్ట్ సంస్థ ఈనెల 27, 28 తేదీల్లో హైడ్రాలజీ సర్వే నిర్వహించింది. ప్రాజెక్ట్‌లో ఎంత మేర పూడిక నిండుకుంది. అందులో బండరాయి, మట్టి ఉందా? ఇసుక, తదితర మెటీరియల్ ఎంత ఉందో తెలుసుకుంటున్నారు. ప్రత్యేకంగా సెన్సార్లతో కూడిన బోటుతో సిబ్బంది సర్వే నిర్వహించారు. ప్రాజెక్ట్‌కు అడ్డంగా పదిలైన్ల చొప్పున ఏర్పాటు చేసుకుని లోకేషన్, ప్రొఫైల్, తదితర రిపోర్టులు సేకరించారు. జియాలజికల్ రిపోర్ట్‌ను బట్టి ఎంత మేర పూడిక ఉందో.. ఎలాంటి మెటీరియల్ ఉందో త్వరలో తేలనుంది.


