జాతర రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలి
మంచిర్యాలఅర్బన్: మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పగిడిమర్రి సోలోమాన్ సూచించారు. సోమవారం మంచిర్యాల డీఎం కార్యాలయంలో ఉమ్మడి జిల్లా డిపో మేనేజర్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అంతకుముందు డిపో ఆవరణలో మొక్కలు నాటారు. డిపో పరిసరప్రాంతాలు పరిశీలించారు. సమావేశంలో రీజియన్ మేనేజర్ భవానీ ప్రసాద్, డిప్యూటీ ఆర్‌ఎం (మెకానికల్) రామయ్య, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, భైంసా డిపో మేనేజర్లు శ్రీనివాసులు, పండరీ, ప్రతిమారెడ్డి, రాజశేఖర్, హరిప్రసాద్, అన్ని డిపోల ట్రాఫిక్, గ్యారేజీల ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.
369 స్పెషల్ బస్సులు
మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సన్నద్ధమైంది. ఉమ్మడి జిల్లాలోని ఆయా డిపోల నుంచి 369 బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన చెన్నూర్ బస్‌పాయింట్ నుంచి 70 బస్సులు, ఆసిఫాబాద్ నుంచి 10, బెల్లంపల్లి పాయింట్ నుంచి 79, భైంసా డిపోకు చెందిన బస్సులను శ్రీరాంపూర్ బస్‌పాయింట్ నుంచి 45, నిర్మల్ డిపోకు చెందిన 50 బస్సులను మందమర్రి పాయింట్ నుంచి, మంచిర్యాల డిపోకు చెందిన 115 స్పెషల్ బస్సులను మంచిర్యాల పాయింట్ నుంచి నడిపించనున్నట్లు ప్రకటించారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అఽర్టీసీ అధికారులు వెల్లండిచారు.


